• ఈ ఆలయం తిరుపతి నగరంలో వెలసింది.
  • కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. 
  • కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. 
  • ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు.
  • తిరుమల కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు.
  • 11వ శతాబ్దంలో  ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.
  • ఈ ఆలయానికి ముందు ఒక  గుడి ఉంటుంది. అది నమ్మాళ్వార్‌ అనే ఆళ్వారు గుడి అని చెబుతారు. 
  • ఈ ఆలయంలో కపిలేశ్వర స్వామితోపాటు కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు.
  • కార్తీక పౌర్ణమినాడు మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సకలతీర్థాలూ నాలుగు గంటలపాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలూ దూదిపింజల్లా పోతాయని ప్రసిద్ధి. 
  • అందుకే కార్తీకమాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు. నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రీతికరంగా దీపాలు వెలిగిస్తారు.
  • కార్తీకంలో ఆరుద్రా నక్షత్రం రోజున ఆలయంలో లక్షబిళ్వార్చన, అన్నాభిషేకం ఘనంగా జరుగుతాయి. 
  • ఏటా డిసెంబరులో తెప్పోత్సవాలూ, మాఘమాసంలో 10రోజులపాటు బ్రహ్మోత్సవాలూ నిర్వహిస్తారు.
  • తిరుపతి బస్టాండు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో అలిపిరి మార్గంలో కపిలతీర్థం ఆలయం ఉంది.