కర్ణాటక రాష్ట్రంలో మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.

పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కే గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగా వెలిసి నిత్యపూజలందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు.

పురాణచరిత్ర…

సుబ్రహ్మణ్య స్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రం చేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కే సుబ్రహ్మణ్య ఒకటి కావడం విశేషం.

నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కే క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రహ్మణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.

ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి తదితర పూజలను నిర్వహిస్తారు.


ఆశ్లేష బలి పూజ:

శ్రీ క్షేత్రం కుక్కే సుబ్రమణ్య దేవస్థానంలో జరిగే అతి పెద్ద కాలసర్ప దోష పూజ ఈ ఆశ్లేష బలి పూజ. సుబ్రమణ్య స్వామి కాల సర్ప దోషము, కుజ దోషముల నుండి భక్తులను రక్షిస్తాడు. ఆశ్లేష బలి పూజ ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాలలో జరప బడుతుంది. ఈ పూజ బ్యాచ్లలో రెండు సమయాలలో జరుపుతారు. మొదటిది ఉదయం  7:00 కు, రెండవది ఉదయం 9:15 కు మొదలవుతుంది. పూజకు హాజరయ్యే భక్తులు తమ తమ బ్యాచ్ ప్రారంభ సమయానుసారం దేవస్థానం లోపల సంకల్పం చేసే పురోహీతుడి ముందు హాజరు కావలెను. హోమ పూర్ణహుతి అనంతరం భక్తులకు ప్రసాదాలు అందచేయబడుతాయి. భక్తులు శ్రావణ, కార్తీక, మృగశిర మాసాలను ఈ పూజ చెయ్యటానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు.


సర్ప సంస్కార / సర్ప దోష పూజలు

సర్ప దోషము నుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈ పూజను చేస్తారు. పురాణనుసారం, ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేక గత జన్మలో కానీ, తెలిసి కానీ, తెలియక కానీ పలు విధములలో ఈ సర్ప దోష బాధగ్రస్టుడు అయ్యే అవకాశం ఉంది. సర్ప దోష బాధితులకు పండితులు ఈ సర్పదోష నివారణ పూజను విముక్తి మార్గంగా సూచిస్తారు. ఈ పుజను ఒక వ్యక్తి కానీ, తన కుటుంబంతో కానీ, లేక పూజారి గారి ఆద్వర్యంలో కానీ చెయ్యవచ్చును. ఈ పూజా విధానం ఒక వ్యక్తి మరణానంతరం జరిగే శార్డం, తిథి, అంత్యక్రియ పూర్వ పూజలలా ఉంటుంది. సార్పాసాంస్కార పూజ చెయ్య దలిచిన భక్తులు రెండు రోజులు సుబ్రమణ్య సన్నిధిలో ఉండవలెను. ఈ పూజ సూర్యోదయం చెయ్యబడుతుంది. ఆ రోజు వేరే ఎటువంటి పూజలు చెయ్యకూడదు. ఈ పూజా ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవస్థానం వారు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే భుజించాలి. పూజను ఎంచుకున్న భక్తుడిని కలుపుకొని నలుగురుకి దేవస్థానం వారు భోజన సదుపాయం కలిపిస్తారు.

తులునాడు ప్రాంతం ఉన్న కర్నాటక, కేరళలో సర్ప దేవుడుకి ఉన్న బహుళ ప్రాముఖ్యం వల్ల ఈ ప్రాంతాల్లో అన్ని మతాలు, వర్గాల వారు ఈ పూజను జరిపిస్తారు. స్వామి వారికి జరిగే మడెస్నానం ఒక ముఖ్యమైన సేవ. స్వామి వారికి మడే స్నానం సేవ ఎంతో ఇష్టం. వీధి మడే స్నానం మరో ముఖ్యమైన సేవ.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.


రోడ్ మరియు రైలు ద్వారా:

బెంగుళూరు నుంచి 278 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు నుంచి 100 కి.మీ. దూరంలో వుంది.