Ad Code

Responsive Advertisement

పోలి స్వర్గదీపం

కార్తీకమాసంలో ప్రతినిత్యం చేయవలసిన విధుల్లో నదీస్నానం , దీపారాధనం ముఖ్యమైనవి. ఈ మాసంలో ఓషధులను, నదీజలాలను శక్తివంతంగా చేస్తాడు చంద్రుడు. అందుకే చంద్రుని ప్రభావం తగ్గకముందే అంటే సూర్యోదయానికి ముందే కార్తీకమాసంలో స్నానము చేయాలనీ పురాణం వచనం. దానికి తోడు దీపారాధన కూడా నిత్యం చేయాలి.



పోలి స్వర్గదీపం  అంటే

కార్తీక స్నానం, దీపారాధన వ్రతదీక్షగా చేసిన వారు,మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఉద్యాపన చేసుకుంటారు. తెలవారుజామున్నే నది స్నానం చేస్తారు. అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెడతారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ పర్వాన్ని ఎక్కువగా జరుపుకుంటారు. కృష్ణ నది తీరంలో ఈ సందడి మరి ఎక్కువగా కనిపిస్తుంది.

ఇంటికివెళ్ళి పోలి స్వర్గం కథ చెప్పుకొని అక్షతలు తలమీద వేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఇహలోక సుఖమే కాకా పరలోకంలో మోక్షప్రాప్తి కలుగుతాయి.

పోలి స్వర్గం కథ :


పూర్వం ఒక ఊరిలో ఒక అత్తగారికి అయిదుగురు కోడళ్ళు ఉండేవారు. వారిలో నలుగురు కోడళ్ళూ, అత్తగారూ కలిసి ఆఖరి కోడలు అయిన పోలిని సాధిస్తూ ఉండేవారు. పనులన్నీ ఆమెతో చేయించేవారు. తిండి కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. పైగా అందరికన్నా తామే గొప్ప భక్తుల్లా భావిస్తూ ఉండేవారు. తనను అత్తింట్లో వెలివేసినట్టు హీనంగా చూస్తున్నా పోలి అన్నిటినీ భరిస్తూ వచ్చేది. ఇరుగుపొరుగువారికి కూడా అవసరమైన సాయాలు చేసేది. కార్తిక మాసంలో నదీ స్నానాలకు మిగిలిన నలుగురు కోడళ్ళతో కలిసి అత్తగారు బయలుదేరేది. అక్కడ వాళ్ళు దీపారాధన చేసి వచ్చేవారు.

అయితే పోలిని మాత్రం రానిచ్చేవారు కాదు. ఆమెను ఇంటికి కాపలాగా ఉంచేవారు. ఆమె ఇంట్లో దీపం వెలిగించుకోవడానికి వీల్లేకుండా అన్నిటినీ దాచి పెట్టేవారు. పోలి ఇంటి పనులన్నిటినీ ముగించుకొని, నూతి దగ్గర స్నానం చేసేది. మజ్జిగ చిలికి, వెన్న తీసి, కవ్వం చివర అంటుకొని ఉండే వెన్నను జాగ్రత్తగా తీసేది. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కింద పడిన కాయల్లోంచీ పత్తిని తీసి, వత్తి చేసేది. దానికి వెన్నరాసి, దీపాన్ని వెలిగించేది. అలా కార్తిక మాసం నెల రోజులూ ఆమె దీపాలు వెలిగించింది. పోలి భక్తికి సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆమెను బొందితో స్వర్గ ప్రవేశం కల్పించాల్సిందిగా దేవదూతలను ఆదేశించాడు. దేవదూతల విమానాన్ని చూసి, అది తమకోసమే వచ్చిందని భావించిన పోలి అత్తగారూ, తోడికోడళ్ళూ దానిలో ఎక్కడానికి సిద్ధమయ్యారు. వారిని దేవదూతలు గెంటేశారు. నిష్కల్మషమైన భక్తి కలిగిన పోలి స్వర్గానికి వెళ్ళింది. ఆ రోజు కార్తిక అమావాస్య. కాబట్టి పోలి కథను తలచుకుంటూ, దీపారాధన చేసిన వారు సుఖ సంపదలను పొందుతారని నమ్మిక.

2022: నవంబర్  24.

Post a Comment

0 Comments