తపస్సు చేయటం, యజ్ఞయాగాలు నిర్వహించటం, తీర్థయాత్రలు చేయటం, వ్రతాలు నోములు నియమంగా చేయటం వీటన్నిటికన్నా గొప్పది ఉత్తములైన మాతా పితరుల సేవ. తల్లితండ్రుల పాదోదకాన్ని తీసుకున్నవాడు సకలపుణ్యతీర్థాల జలాలనీ సేవించిన ఫలితాన్ని పొందుతాడు. తల్లి తండ్రుల సేవచేసే వారికి వేరే తపస్సులతో పనిలేదు. తల్లితండ్రులకి సేవచేసిన పుత్రులకి ఉత్తమగతులు కలుగుతాయి.
- తల్లిని సేవించటం వల్ల కుమారుడుకి ఉత్తమలోకాలు లభిస్తాయి.
- అలాగే తండ్రిని సేవించటం వల్ల కూడా మహాపుణ్యం లభిస్తుంది.
- తల్లి తండ్రులున్న చోటే పుత్రుడికి గంగా, గయ తీర్థ స్థలం.
- తల్లిదండ్రుల సేవచేసినవాడికి అన్ని తీర్థాల్నీ సేవించిన ఫలం లభిస్తుంది.
- మాతా పితలసేవలో తరించిన వాడికి దానం, తపస్సు చేసినంత పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది.
ఇహపరాల్లో సకల సుఖాలు తల్లితండ్రుల సేవచేసిన వారికి లభిస్తాయి. ఇంకా తల్లి తండ్రుల సేవచేసిన వారికి ఎలాంటి శుభఫలితాలు కలుగుతాయంటే అతన్ని దేవతలు కూడా అభిమానిస్తారు. ఋషులు అతన్ని చూసి ఆశీర్వదిస్తారు. ముల్లోకవాసులూ అలాంటి పుణ్యాత్ముణ్ణి చూసి ఆనందిస్తారు.
ప్రతిరోజూ మాతాపితలకి పాదప్రక్షాళన చేసినవాడికి గంగాతీర్థంలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. పవిత్రమైన ఆహారపదార్థాలు తల్లిదండ్రులను సంతృప్తి పరిస్తే అలాంటివాడు సర్వజ్ఞుడై అఖండమైన కీర్తి ప్రతిష్ఠలు పొందుతాడు.తల్లి తండ్రులతో సంతోషంగా ప్రేమగా సంభాషించిన వాడిని చూసి ఎంతో సంతోషించి సకల నిధులూ అతడి ఇంట్లో స్థిరంగా కొలువుంటాయి.
తల్లి తండ్రులకి స్నానం చేయించేడప్పుడు వారి శరీరం మీద నుంచి పుత్రుల శరీరం మీద నీటి బిందువులు పడితే అతడికి సర్వతీర్థ స్నానఫలం దక్కుతుంది.పతితుడు,వృద్ధుడు, వికలాంగులు, వ్యాధిగ్రస్తుడు అయిన తండ్రి లేదా తల్లికి సేవలు చేసిన వాడికి శ్రీహరి ప్రసన్నుడై వరాలిస్తాడు.యోగులు కూడా చేరలేని వైకుంఠధామాన్ని అతడు చేరుకుంటాడు.
వికలాంగులు, వృద్ధులు, దీనులైన తల్లి తండ్రుల్ని పరిత్యజించినవారు భయంకరమైన నరకాన్ని చేరుకుంటారు.వృద్ధులైన తల్లి తండ్రుల్ని అవమానించి ప్రవర్తించేవాడు శతకోటి జన్మలు మొసలిగా జన్మిస్తాడు. కఠినమైన మాటలతో తల్లి తండ్రుల్ని బాధించిన వాడు పెద్దపులి లేక భల్లూకంగా జన్మిస్తాడు.
పుత్రులకి తల్లి తండ్రులకన్నా సమానమైన తీర్థం లేదు.
ఇహ పరాలలో నేను తరించటానికి పితృదేవుణ్ణి పూజిస్తున్నాను. అలాగే మాతృదేవతని కూడా పూజిస్తున్నాను. కనుకనే నేను యోగినయ్యాను. తల్లితండ్రుల అనుగ్రహంతోనే నాకు జ్ఞానం కలిగింది. అని గ్రహించిన పుత్రుడు ఉత్తముడు.తల్లి తండ్రుల్ని పూజించని వారు చదివిన వేదాలు చేసిన దానాలు యజ్ఞాలు అన్నీ వ్యర్థం తల్లితండ్రుల్ని సేవించటం పుత్రుల ధర్మం. మానవులలో తల్లితండ్రులే గొప్ప తీర్థం. తల్లితండ్రుల సేవే పుత్రులకి మోక్షం.అదే వారికీ వేల జన్మల పుణ్యఫలాన్నిస్తుంది.
0 Comments