ప్రసిద్ధి చెందిన రంగనాధ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం నెల్లూరు పట్టణంలోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున కొలువైంది. ఈ ఆలయాన్ని 7 వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు, 12 వ శతాబ్దంలో రాజమహేంద్రవర్మ ఈ ఆలయాన్ని అభివృధి చేసారు.
విశాలమైన ఆలయ ప్రాంగణమునకు తూర్ప దిశలో ఏడు అంతస్ధుల రాజగోపురం ఉంది. ఆలయ ప్రవేశం రాజగోపురం క్రింద నుంచి జరుగుతుంది. ప్రధానాలయం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. ఆలయంనకు పశ్చిమ వైపున పెన్నానది ప్రవహిస్తోంది.
గర్భాలయంలో శేషుతల్పం పై శయనముద్రలో శీ రంగనాథడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి - భూదేవి దర్శనమిస్తారు. ఈ ఆలయంలోనే , శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించవచ్చు.
- మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు.
- ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది.
- గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి వుంచుతారు.
- ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్ కు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.
స్థలపురాణం,
మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యప ముని ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించాడు. అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరిఢవిల్లుతుందని అక్కడ శ్రీ రంగనాథస్వామిగా వెలశాడు. మరో కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలోనుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీరంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మరోటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలసినట్లు స్కంద పురాణం, వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది.
ముఖ్యమైన పండుగలు :
శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారికీ ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.
వైకుంఠ ఏకాదశి
ధనుర్మాస ఉత్సవాలు
ఆలయ వేళలు :
ఉదయం 6:30 నుంచి 12 గంటలు తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటలు వరకు.
ఎలా వెళ్ళాలి :
నెల్లూరు బస్టాండ్ / రైల్వే స్టేషన్ నుండి 4 కి.మీ
చుట్టూ ప్రక్కల దర్శించవలసిన ఆలయాలు :
జొన్నవాడ మల్లికార్జున స్వామి ఆలయం - 14 కి.మీ
వేదగిరి నరసింహ స్వామి ఆలయం - 12 కి.మీ
నెల్లూరు మూలస్థానేశ్వర స్వామి ఆలయం - 4 కి.మీ
0 Comments