శ్రీ కోదండరామ ఆలయం కడప జిల్లా ఒంటిమిట్ట పట్టణంలో వెలసింది. ఇది దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలలో ఒక్కటి. ఈ క్షేత్రం ఏకశిలానగరం అని ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు.ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది.
స్థల పురాణం
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.
దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు కథనం.
ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది.చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు.
చంద్రుని వెలుగుల్లో స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు.
ముఖ్యమైన పండుగలు
శ్రీరామనవమి
వైకుంఠ ఏకాదశి
ఉగాది
ఆలయ వేళలు
ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు
మధ్యాహ్నం 2.00 నుండి రాత్రి 8.00 వరకు
ఎలా వెళ్ళాలి
కడప నుంచి 26 కి.మీ.దూరంలో వుంది ఈ ఆలయం.
చుట్టూ ప్రక్కల దర్శించవలసిన ఆలయాలు
నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయం - 19 కి.మీ
దేవుని కడప వేంకటేశ్వర స్వామి ఆలయం - 25 కి.మీ
తాళ్ళపాక శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం - 27 కి.మీ
0 Comments