2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి జరుగనుంది. వస్తుంది. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు టిటిడి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రోజుకు దాదాపు 80 వేల మందికి దర్శనం కల్పించనున్నారు. ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్నిరకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్ఇడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు “మహా లఘు దర్శనం” కల్పిస్తారు.


రోజుకు 25 వేలు చొప్పున 10 రోజులకు కలిపి 2.50 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 2023 జనవరి కోటాలోనే ఈ టికెట్లు విడుదల చేస్తారు. తిరుమల స్థానికుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కౌంటరుతో పాటు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో రోజుకు 50 వేలు చొప్పున మొత్తం ఐదు లక్షల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చూపి ఈ టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్‌లుగా విభజించి  పర్యవేక్షిస్తారు.


రోజుకు 2000 చొప్పున శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ప్రతిరోజూ 2000 మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయిస్తారు. సిఫార్సు లేఖలు తీసుకోబడవు.


నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా డిసెంబర్ 29 నుండి జనవరి 3 వరకు వసతి అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేస్తారు. గదుల కేటాయింపులో పారదర్శకత పెంచేందుకు మరిన్ని కౌంటర్లు పెంచి సిఆర్వోలో మాత్రమే కేటాయిస్తారు.