గోవర్ధన పూజ: కార్తిక శుద్ధ పాడ్యమి నాడు కార్తీక వ్రతారంభం చేసేవారు ఆకాశదీపాన్ని ప్రదోష సమయంలో వెలిగిస్తారు. అది సాధ్యం కానివారు ఆ దీపాన్ని దర్శించినా అంతే ఫలితం పొందుతారు. శివాలయాలలో ఆకాశ దీపం వెలిగిస్తారు. ఆ రోజున గోవర్ధన పూజ చేయాలి. అవకాశం లేనివారు అష్టమి నాడు గోపాష్టమి నిర్వహించవచ్చు.
భగినీ హస్త భోజనం: విదియ నాడు యమున ఆహ్వానం మేరకు ఆమె సోదరుడైన యమధర్మరాజు విందు ఆరగిస్తాడు. కానుకలు ఇస్తాడు. సోదరి ఇంట విందు ఆరగించేవారు మరణానంతరం నరకలోకం సందర్శించరని వరమిస్తాడు. ‘ప్రీతి విదియ’గా ఈ రోజు ప్రాచుర్యం పొందింది. ‘భగినీ హస్త భోజనం’గా ఉత్తరాదిన జరుపుకొంటారు.
జగన్మాత పూజ: తదియ నాడు జగన్మాతను కుంకుమతో పూజించి, సౌభాగ్య సిద్ధి పొందవచ్చు.
నాగుల చవితి: చవితి, పంచమి తిథులు నాగుల చవితిగా, నాగ పంచమిగా ప్రసిద్ధం. ఈ రోజుల్లో పుట్టలోని నాగులను కుటుంబ సమేతంగా ఆరాధిస్తారు. నాగదేవతకు పండ్లు, పాలు, చలిమిడి, చిమ్మిరి, వడపప్పు నివేదించి, పుట్టమన్నును చెవికి పూసుకుంటారు. ఇలా చేస్తే వినికిడి లోపం కలగదని నమ్మకం. నాగేంద్రుడికి ఎర్రటి గళ్ళున్న వస్త్రాన్ని సమర్పిస్తారు.
సుబ్రహ్మణ్యారాధన: షష్టి రోజు సుబ్రహ్మణ్యారాధనకు ప్రత్యేకమైనది. కృత్తికలు పెంచిన సుబ్రహ్మణ్యుడు శరవణభవునిగా పిలుపునందుకుంటున్నాడు.
ఉత్థాన ఏకాదశి: కార్తిక శుధ్ధ ఏకాదశిని ‘బోధనైకాదశి’ అనీ, ‘ఉత్థాన ఏకాదశి’ అనీ అంటారు. ఆషాఢమాసంలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు ఈ రోజున మేలుకుంటాడు. విష్ణ్వాలయాల్లో ఈ రోజు ఘనంగా పూజలు జరుగుతాయి. చాతర్మాస్య వ్రత దీక్షలు ఈ రోజుతో పరిసమాప్తమవుతాయి.
క్షీరాబ్ధి ద్వాదశి: దీన్ని ‘చిలుకు ద్వాదశి’ అని కూడా అంటారు. ఈ రోజున క్షీరసాగర మథనం ప్రారంభమయింది. ఇదే రోజున సాగరం నుంచి మహాలక్ష్మి ఆవిర్భవించింది. క్షీరాబ్ది ద్వాదశి గురించి భాగవతంలోనూ, పలు పురాణాల్లోనూ కథలున్నాయి. ఈ రోజున శ్రీహరికీ, మహాలక్ష్మికీ విష్ణ్వాలయాల్లో కల్యాణం జరుగుతుంది. బృందావనం (మథురకు సమీపంలో) శ్రీ మహా విష్ణువుకూ, తులసి (బృంద)కీ వివాహం జరుగుతుంది. తెలుగునాట గృహిణులు తులసి కోట దగ్గర ముగ్గులు పెట్టి, దీపాలు వెలిగించి, విష్ణువుకు ప్రతీకగా ఉసిరిక కొమ్మను నాటి తులసీ కల్యాణం చేస్తారు. చెరుకు ముక్కలు, చలిమిడి, వడపప్పు నివేదించి, ప్రసాదంగా అందరికీ పంచుతారు. శంఖచూడుడు, బృందల కథను పురాణాలలో ప్రముఖంగా ప్రస్తావించారు.
కార్తిక పౌర్ణమి: కార్తిక పూర్ణిమ మహిమాన్వితం, పవిత్రమైనది. శివకేశవులకూ, శక్తికీ ఈ రోజున విశేషమైన ఆరాధనలు జరుగుతాయి. ఈ రోజు చేసే స్నాన, జప, ధ్యానాదులు విశేషమైన ఫలితాలనిస్తాయి. తెలుగునాట ఈ రోజున 33 పున్నముల వ్రతాలు చేస్తారు. తులసికోట దగ్గర 365 వత్తులను నేతిలో వెలిగించి, లక్ష్మీ నారాయణులకు సమర్పిస్తారు. ‘దేవ దీపావళి’గా కాశీక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తారు. శివాలయాలలో జ్వాలాతోరణం ఉత్సవం జరుగుతుంది. పార్వతి తన భర్త శివుడు క్షీర సాగర మథన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని మింగినప్పుడు, తన మాంగల్యం మీద నమ్మకంతో, భర్తకు ఎలాంటి ఆపద కలుగకూడదని కోరుకుంటూ, జ్వాలాతోరణం కింద నుండి భర్తతో తిరుగుతానని మొక్కి, దాన్ని తీర్చుకున్నదని కథనం. త్రిపురాసుర సంహారానంతరం భర్తకు స్వాగతం ఇచ్చిన విధం ఈ ‘జ్వాలాతోరణం’ అని మరొక కథ.
కార్తిక సోమవారం ఉపవాసాలు, అభిషేకాలు, నక్తవ్రతాలు, చన్నీటి స్నానాలు.. ఇవన్నీ ఆయుర్వేదరీత్యా ముఖ్యమైనవిగా చెబుతారు.
0 Comments