దేశంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మూడవది పళని. ఈ ఆలయం తమిళనాడులోని దిండుక్కల్ జిల్లాలో వెలసింది.
ఈ క్షేత్రం చాలా పురాతనమైనది.ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళులు ఈయనను "పళని మురుగా" అని కీర్తిస్తారు. ఈ ఆలయంలో స్వామివారు చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది.
భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం "నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో" - అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్థం. అంటే ఈ పళని జ్ఞానము ఇచ్చే క్షేత్రము.
సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగే "కావడి ఉత్సవం" మొట్ట మొదట ఈ పళని లోనే ప్రారంభం అయ్యింది.
స్థల పురాణము
పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని వినాయక స్వామికి, సుబ్రమణ్య స్వామికి పెట్టిన పరీక్షలో వినాయకుడు యుక్తితో ఆది దంపతులు, తన తల్లి తండ్రులు అయిన ఉమా మహేశ్వరుల చుట్టూ మూడు మాట్లు ప్రదక్షిణ చేస్తాడు. షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. వినాయకుడు పార్వతీపరమేశ్వరులకు కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల, సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్ళినా, అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు.
అప్పుడు శివుడు సుబ్రమణ్య స్వామితో "నువ్వే సకల జ్ఞాన ఫలానివి" అని ఊరడిస్తాడు.సకల జ్ఞాన ఫలం (తమిళంలో పలం), నీవు (తమిళంలో నీ) – ఈ రెండూ కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తాడు.
ఈ మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడింది.ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశాడు. తొమ్మిది రకాల విషపూరిత రాళ్లతో చేశారు. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుక నుండి స్వామి వారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠు రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే, వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా, స్వామి వారి తొడ భాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారని చరిత్ర. ఇప్పటికీ స్వామి వారిని వెనుక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెబుతారు.
ఆలయ వేళలు : ఉదయం 5.30 నుండి రాత్రి 9.30 వరకు
5.40 - విశ్వరూప దర్శనం
6.50 - విల పూజ
8.00 - శిఱుకాల శాంతి పూజ
9.00 - కాల శాంతి పూజ
12.00 - ఉచి కాల పూజ (మధ్యాహన పూజ)
5.30 - సాయరక్ష (సాయంకాల పూజ)
8.00 - రకాల పూజ
ప్రతి మాసంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.
ఎలా వెళ్ళాలి :
మధురై నుండి 120 కి.మీ దూరం
దిండిగల్ నుండి 60 కి.మీ దూరం
పళని బస్టాండ్, రైల్వే స్టేషన్ నుండి 2 కి.మీ దూరం
కోయంబత్తూర్ 110 నుండి కి.మీ దూరం
చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :
పళని ఇదుంబన్ ఆలయం - 1 కి.మీ దూరం
దిండిగల్ శ్రీనివాస పెరుమాళ్ ఆలయం - 60 కి.మీ దూరం
పొల్లాచి సుబ్రమణ్య స్వామి ఆలయం - 72 కి.మీ దూరం.
మరి కొన్ని వివరాలకు : http://palanimurugantemple.org/
0 Comments