Ad Code

Responsive Advertisement

శ్రీ సుబ్రమణేశ్వర స్వామి ఆలయం - పంపనూరు

ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి  ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది.

ఇక్కడ ధన ధాన్యాలనూ, జ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ అందించే వరప్రదాతగా అక్కడ స్వామి ప్రసిద్ధిచెందాడు.

ఇక్కడి మూలవిరాట్టును ఒకే శిలతో ఐదు రూపాలు స్ఫురించేలా మలిచారు. 

విగ్రహం పీఠం నుంచి శిరసు వరకూ ఒక్కో రూపం ఒక్కో దేవతను సూచిస్తుంది. 

ఇందులో పీఠం భాగంలో శ్రీచక్రం పార్వతీదేవికీ, ఆపై భాగంలో చుట్టలు చుట్టేసినట్లుగా కనిపించే సర్పం నాగేంద్రుడికీ, సర్పరూపంలోని చివరి భాగం వక్రతుండుడి ఆకారంలో, మూలవిరాట్టు మధ్యభాగం శివలింగంగా దర్శనమిస్తుంది. సర్పం శిరస్సు భాగం ఏడు తలలతో పడగవిప్పిన నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు. ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజలందుకుంటోంది. 

శివుడూ పార్వతి, గణపతి, షణ్ముఖుడు, నాగేంద్రుడు ఇలా శివుడి పరివారమంతా ఒకే చోట, ఒకే విగ్రహంలో దర్శనమివ్వడం ఇక్కడి ఆలయంలో విశేషం.

పూర్వం యోగులూ, మహర్షులూ తపస్సును ఆచరించిన ఈ తపోవనంలో ఏడు కోనేర్లు ఉండేవని చెబుతుంటారు. ప్రస్తుతం వీటిలో ఆరు కోనేర్లు శిథిలం కాగా, దేవాలయం తూర్పు దిక్కున ఒకకోనేరు మాత్రమే మిగిలి ఉంది.

ప్రతి శ్రావణ, కార్తీక, మాఘ మాసాల్లో విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. 

ప్రధానంగా శ్రావణ మాసంలో శతసర్ప క్షీరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం, అష్టోత్తర కలశాభిషేకం, మూలవిరాట్టుకు అఖండ అన్నాభిషేకాన్ని జరిపిస్తారు. కార్తికమాసం మూడో ఆదివారం ఉసిరి చెట్టు, తులసీమాత, బృందావనానికి తులసీదామోదర కల్యాణోత్సవం జరిపిస్తారు. అదేరోజు ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవాన్నినిర్వహిస్తారు. 

ప్రతి మాఘమాసం రెండో ఆదివారంనాడు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహిస్తారు. 

మహా శివరాత్రి రోజున ఆలయానికి ఉత్తరానఉన్న కైలాసద్వార ప్రవేశం కల్పిస్తారు. నాగ దోషం, కాలసర్ప దోషం, శనిగ్రహ దోషం,రాహు కేతు దోషాలు ఉన్న భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. 

భక్తులు కోరిన కోరికలు నెరవేరడంతో స్వామివారికి ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఆలయ వేళలు 

ఉదయం 06.30 నుండి మధ్యాహ్నం 1.00 వరకు 

సాయంత్రం 4.30 నుండి రాత్రి 8.00 వరకు

ఎలా వెళ్ళాలి 

అనంతపురం 20 నుండి కి.మీ దూరం 

Post a Comment

0 Comments