Ad Code

Responsive Advertisement

శూన్యమాసం అంటే ఏంటి

 సూర్యమానం ప్రకారం, చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు. సూర్యమానం ప్రకారం ధనుర్మాసం - చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్య మాసమంటారు. ధనుర్మాసం మొత్తం  శూన్య మాసం కాదు అదేవిధంగా పుష్య మాసం మొత్తం కూడా శూన్య మాసం కాదు. ధనుర్మాసం ప్రారంభమైన కొద్దిరోజులకు పుష్య మాసం ప్రారంభం అవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమయినా ముందు రోజు వరకు శూన్య మాసం కాదు. అదేవిధంగా ధనుర్మాసం అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్య మాసం కాదు.


మీన మాసంతో కూడిన చైత్రమాసం, మిధున మాసంతో కూడిన ఆషాడ మాసం, కన్యా మాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్య మాసాలను శూన్య మాసాలంటారు. ఈ కాలంలో గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభ కార్యాలకు ముహుర్తాలు శూన్యం. అధిక మాసంలో కూడా శుభ కార్యాలకు ఎటువంటి ముహుర్తాలుండవు. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించరాదు. శని జన్మ నక్షత్రం పుష్యమి కావడంతో ఈ పుష్యమాసంలో ఏం శుభకార్యం చేసినా సత్ఫలితాన్నివ్వదని చెబుతారు.పితృ కార్యాలు మాత్రం శూన్య మాసంలో చేయవచ్చు.


హిందువులకు చాంద్రమానము సూర్యమానమని రెండు రకాల కాలమానాలు (క్యాలెండర్) ఉన్నాయి. చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకుని చాంద్రమాన మాసాలు ఏర్పడతాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అని పన్నెండు మాసాలు ఉన్నాయి. శుక్ల పాడ్యమి మొదలు అమావాస్య వరకు ఒక నెలగా పరిగణిస్తారు. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణ పాడ్యమి మొదలు మళ్లీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసంగా పరిగణిస్తారు. పూర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు. ఉదాహరణకు చంద్రుడు పూర్ణిమనాడు చిత్త నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చైత్ర మాసం అంటారు. చంద్రుడు విశాఖ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసమని పిలుస్తారు. 


సూర్యుడు ప్రతినెలా ఒక రాశిలో ఉంటాడు. ధనుర్మాసంలో ధనుస్సురాశి దగ్గర ఉంటాడు. మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం ఈ పన్నెండు రాశుల పేర్లతో పన్నెండు సూర్య మాన నెలలు ఉంటాయి. సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకొని తయారుచేసిన కాలమానం రుతువులకు సామీప్యంగా ఉంటుంది.

Post a Comment

0 Comments