Ad Code

Responsive Advertisement

దక్షిణాయనం విశిష్టత

వర్షరుతువుతో మొదలయ్యే దక్షిణాయనాన్ని సృష్టికి ఆరంభ కాలమని చెబుతారు. తొలకరితో నేలతల్లి పులకరిస్తుంది. విత్తుకు జీవం పోస్తుంది. మానవ హృదయం- ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. అమృతత్వసిద్ధికి ఉపకరించే విత్తనాలను కడుపులో దాచుకున్న పంటభూమి. ఆ విత్తులు మొలకెత్తాలంటే సాధన అనే తడి తగలాలి. దక్షిణాయనపు తొలకరి కలిసిరావాలి. కనుక దక్షిణాయనాన్ని సాధనానుకూలం అన్నారు.

శ్రావణంతో దక్షిణాయనం మొదలవుతుంది. శ్రావణమాసంలో వేదశ్రవణం పరమపావనం. వేదపండితులు ఎదురైతే ‘శ్రావణ భాద్రపదాలు’ ఏతెంచాయనేవారు. వారి సంచారాలు, వేదసభలు శ్రావణంలో ముమ్మరం అవుతాయి. వేదపఠన, శ్రవణాదులతో ఆధ్యాత్మిక చైతన్యం పురివిచ్చుకొంటుంది. కుండలిని జాగృతం అవుతుంది. విత్తు మొలకవుతుంది.
భాద్రపదంలో బ్రహ్మదేవుడు గణపతిగా ఆవిర్భవిస్తాడు. గణపతిది పృథివీతత్వం. అంటే, షట్చక్రాల్లో మొదటిదైన మూలాధారతత్వం. కనుకనే దీక్షితులవారు గణపతిని ‘మూలాధార క్షేత్రజ్ఞుడు’ అన్నారు, వాతాపి గణపతింభజే కీర్తనలో! ఈమాసంలో మట్టివినాయకుడి రూపంలో పృథివీతత్వాన్ని ఆరాధిస్తాం. మూలాధారంలో కుండలిని జాగృతికి స్వాగతం పలుకుతాం.
శ్రావణ భాద్రపదాల దరిమిలా గుండె తలుపుతట్టే ఆశ్వయుజం- శక్తికి సంకేతం. సకలశక్తి స్వరూపిణిగా దేవీ నవరాత్రుల పేరుతో అమ్మవారి అన్ని చైతన్య స్వరూపాలను ఆవాహన చేసుకొనే కాలమిది. అమృతత్వసిద్ధికి అడ్డుపడుతున్న అంతశ్శత్రువులను నిర్మూలించి మనిషి మహాశక్తిమంతుడయ్యే సమయం ఇది. ఆదిశక్తియైన సీతమ్మవారి అన్వేషణకై, హనుమ తనలోని సర్వశక్తులను కూడగట్టుకున్నది ఆశ్వయుజంలోనే. ప్రయాణం మొదలైంది ఈ శరదృతువులోనే. హనుమస్ఫూర్తితో మనలోని శత్రువులను మట్టుబెట్టడానికి కీలకమైన మాసమిది. ఆ విజయానికి ప్రతీకే- విజయదశమి సంబరం. అదే దసరా నవరాత్రుల పరమార్థం.
పుట్టుకకు కారణం- కాముడు (మన్మథుడు). మరణానికి మూలం- కాలుడు (యముడు). కాముణ్ని, కాలుణ్ని శివుడే సంహరించాడని పురాణ కథనం. శివుడికి ప్రీతిపాత్రమైంది- కార్తికం! శివారాధనం- కార్తిక మాసానికి పతాకశీర్షిక వంటిది. యముణ్ని మన్మథుణ్ని మట్టి కరిపించాడంటే అర్థం- మనిషిని చావుపుట్టుకల నుంచి దూరం చేస్తాడని! కనుక కార్తికంలో పరమశివార్చనకు ప్రాశస్త్యం లభించింది.
‘నేను చనిపోతున్నాను’ అన్నది అజ్ఞానం. ‘దేహాన్ని విడిచిపెడుతున్నాను’ అనేది జ్ఞానం. జ్ఞానంలోంచి మోక్షానికి నడిపించేవాడు మహావిష్ణువు. మార్గశిర మాసం విష్ణుపారమ్యాన్ని భజిస్తుంది. ‘మాసాల్లో నేను మార్గశీర్షం’ అని గీతాచార్యుడు ప్రకటించడం దానికి కారణం. విష్ణువును మోక్షప్రదాతగా చెబుతారు. విష్ణు ఆరాధనతో జీవుడు జ్ఞానస్థితిలోంచి మోక్షమార్గం పడతాడు. తదుపరి పుష్యమాఘాలు సూర్యారాధనకు అనుకూలాలు. పుష్యంతో ఉత్తరాయణం ఆరంభం అవుతుంది. శ్రావణంతో సాధన మొదలై, భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తికంలో శివుణ్ని, మార్గశీర్షంలో మహావిష్ణువును, పుష్యమాఘాల్లో సూర్యుణ్ని అర్చించడంతో అమృతత్వ స్థితి సిద్ధిస్తుంది. ఇదే ‘పంచాయతన’ పూజావిధానం. గాణాపత్యం, శాక్తేయం, శైవం, వైష్ణవం, సౌరం.అయిదింటి సమ్మేళన మహాయోగం- పంచాయతనం. దక్షిణాయనంలోని ఈ సాధనాక్రమం ఉత్తరాయణంలో పుణ్యఫలాలను అందించి, జీవుణ్ని ఆవలిగట్టుకు చేరుస్తుంది. ఆ ప్రయాణానికి ఇదే శుభ సుమూహర్తం.

Post a Comment

0 Comments