Ad Code

Responsive Advertisement

ఏరువాక పున్నమి

వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా చేసుకునే పండుగ- ఏరువాక పున్నమి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు సకుటుంబంగా జరుపుకొనే ఈ ఉత్సవాన్ని ‘కృషి పూర్ణిమ’ లేదా ‘హల పూర్ణిమ’ అని వ్యవహరిస్తారు. రైతులు పంటపొలాల్లో, వ్యవసాయ పరికరాల్లో, పశుసంపదలో దైవత్వాన్ని చూసుకొని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఏరు అంటే నాగలి అని, ఏరువాక అంటే దుక్కిదున్నడం ప్రారంభించే రోజు అని అర్థాలున్నాయి.



సువృష్టి ప్రసాదించే ఇంద్రుణ్ని అందరూ ఆరాధిస్తారు. పొలం దున్నడానికి ఉత్తమమైనదిగా ‘జ్యేష్ఠ’ను భావిస్తారు. చంద్రుడు ఆ నక్షత్రంతో కూడి ఉన్నదే జ్యేష్ఠ పూర్ణిమ. ఆయన సకల ఓషధులకు అధిపతి. అవి పుష్కలంగా ఉంటే, వ్యవసాయం విశేషమైన ఫలసాయం అందజేస్తుంది. అందువల్ల అన్నదాతలు క్షేత్రపాలుణ్ని స్తుతిస్తూ మంత్రపఠనం చేసేవారని రుగ్వేదం చెబుతుంది.

ఏరు అంటే, ఎడ్లను కట్టి దున్నేందుకు సిద్ధంచేసిన నాగలి. ఏరువాక అంటే, దున్నే ఆరంభ దశ అని నిఘంటువులు చెబుతాయి. అధర్వణ వేదకాలంలో రైతులు దీన్ని ‘అనడుత్సవం’ అని పిలిచేవారు. హలకర్మ పేరుతో నాగలి పూజ చేసేవారు. మేదినీ ఉత్సవం పేరిట భూమిపూజ, వృషభ సౌభాగ్యం అంటూ పశువుల పూజ ఆచరించేవారు. ‘బృహత్సంహిత’లో, పరాశర విరచితమైన ‘కృషి పరాశరం’ గ్రంథంలోనూ ఈ ఉత్సవాల ప్రస్తావనలున్నాయి. దీన్ని కర్ణాటకలో ‘కారిణి పబ్బం’ పేరుతో నిర్వర్తిస్తారు.

పున్నమి పర్వదినాన ‘పద్మపురాణం’ గ్రంథాన్ని దానం చేయడం అశ్వమేధ యాగ ఫలితంతో సమానమని పెద్దలు చెబుతారు. ఇదే రోజున కృష్ణాజినం సైతం దానం చేస్తారు. ఏరువాక పున్నమినాడు మహిళలు భర్త క్షేమం కోసం ‘వటసావిత్రి’ వ్రతం చేస్తారు. వ్యవసాయ పరికరాలతో పాటు పశువుల్ని పూలు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. టెంకాయలు, పండ్లు, పొంగలి నివేదన చేస్తారు. ఎడ్ల బండ్లను, ఎడ్లను కట్టిన నాగళ్లను మంగళవాద్యాలతో వూరేగిస్తారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, కోలాటాలతో సంబరాలు చేసుకుంటారు. ద్వారాలకు గోగునారతో చేసిన తోరణాల్ని కడతారు. వాటిని చర్నాకోలతో కొట్టి, దొరికిన పీచు తీసుకెళ్లి భద్రపరచుకుంటారు.

గ్రామీణ ప్రాంతాల సంస్కృతిని పరిరక్షించడంలో అన్నదాతల పాత్ర ఎనలేనిది. మెతుకు పెట్టి బతుకునిచ్చే రైతుల ఉత్సవమిది. సమాజమంతటికీ ఇది ఉత్సవమే! రైతు క్షేమమే దేశానికి క్షేమం. రైతు సౌఖ్యమే దేశానికీ సౌఖ్యం. కృషీవలుర పారమార్థిక చింత ప్రశంసనీయమైనది. నేలలో విత్తి, నింగి వైపు చూసే రైతు- కంట తడిపెట్టే దశ ఎన్నడూ రాకూడదు. భారతీయ సంస్కృతికి, జాతి జీవన విధానానికి పట్టుకొమ్మలే ‘ఏరువాక’ వంటి పల్లె వేడుకలు. ఇవి నవనవోన్మేష చైతన్యానికి, జాతి మనుగడకు అన్నివిధాలా దోహదపడతాయి. కర్షకుడి కళ్లలో ఆనందదీపాల్ని వెలిగిస్తాయి.

2021 :  జూన్  24.

Post a Comment

0 Comments