పూర్వం చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మవాదులకి దానం గొప్పతనాన్ని ఏ ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? దానం ఎవరికి ఇవ్వాలి అనే విషయాలు ఇలా వివరంగా ప్రబోధించాడు.
- సంపాదించిన ధనాన్ని వేదవేదాంగాలు పఠించిన సత్పాత్రుడికి శ్రద్ధా పూర్వకంగా సమర్పించటమే దానం.
- దానం భోగ మోక్షాలు రెండిటినీ ప్రసాదిస్తుంది.
- ఎంతో శ్రద్ధగా ఉన్నతమైన వారికి సమర్పించిన విత్తమే దానం అని చెప్పబడుతోంది.
దానం నిత్యం-నైమిత్తికం-కామ్యం-విమలం అని నాలుగు విధాలుగా ఉంటుంది
1. నిత్యదానం : తనకి ఎలాంటి ఉపకారం చేయకపోయినా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేసేది
2. నైమిత్తికం : తాను చేసిన పాపాల పరిహారం కోసం పండితులకి చేసే దానాన్ని నైమిత్తిక దానం అంటారు
3. కామ్యదానం : సంతానం కలగటం కోసం, సంపదలు పెంపొందటం కోసం, వ్యాపారాభివృద్ధికోసం చేసే దానం
4. విమలదానం : పరమేశ్వర ప్రీత్యర్థం బ్రాహ్మణులకి ధర్మబుద్ధితో సమర్పించే దానం. ఇది సకల శుభప్రదం.
- తన కుటుంబానికి సరిపోయినంత ఉంచుకుని ఆ మిగిలిన దాన్నే దానం చేయాలి
- నిత్యాగ్ని హోత్రుడైన విప్రుడికి భూదానం చేసినవాడికి పునర్జన్మ ఉండదు.
- భూదానం అన్నదానాన్ని మించినవి మరొకటి లేవు.
- యోగ్యుడైన విప్రుడికి విద్యాదానం చేసినవాడు బ్రహ్మలోకానికి వెళతాడు.
- బ్రహ్మచారికి శ్రద్ధగా ప్రతీరోజూ భోజనం పెట్టేవాడు అన్ని పాపాల్ని తొలగించుకుని బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు
- గృహస్థుడైన బ్రాహ్మణుడికి చేసిన అన్నదానం గొప్ప ఫలితాన్నిస్తుంది అయితే గృహస్థుడికి కేవలం వండుకోవటానికి తగిన ఆహారపదార్థాలనే ఇవ్వాలి గానీ, వండినది దానంగా ఇవ్వకూడదు.
- వైశాఖ శుద్ధ పూర్ణిమనాడు తాను ఉపవాసం ఉండి ఏడుగురు మంది యోగ్యులైన విప్రుల్ని భక్తిగా పూజించి "ప్రియ తాం ధర్మరాజః” అని సంకల్పం చెప్పి వారికి సమృద్ధిగా భోజనం పెట్టాలి. అలా చేసిన వాడికి జీవితకాలంలో చేసిన పాపాలు నశిస్తాయి.
- జింకచర్మాన్ని, నువ్వుల్ని, బంగారాన్ని, తేనెని విప్రుడికి శ్రద్ధగా దానం చేస్తే పాపాలు నశిస్తాయి.
- వైశాఖ పూర్ణిమనాడు వండిన అన్నాన్ని, నీళ్ళకుండని విప్రుడికి దానం చేస్తే అన్ని రకాల భయాలూ తొలగిపోతాయి
- మాఘశుద్ధ ద్వాదశినాడు బంగారాన్ని, నువ్వులతో కూడిన జలకుంభాన్ని (నీటికుండ) 5గురు లేక 7 గురికి దానం చేస్తే బ్రహ్మహత్యాది పాపాలు సైతం తొలగిపోతాయి.
- అమావాస్యనాడు పండితుడైన బ్రాహ్మణుణ్ణి శివస్వరూపుడిగా భావించి సోమఃప్రీయతాం” అని సంకల్పం చెప్పుకుని ఏ వస్తువుల్ని దానం చేసినా ఏడుజన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయి
- కృష్ణపక్ష చతుర్దశినాడు స్నానంచేసి, యోగ్యుడైన విప్రుణ్ణి శంకరుడిగా భావించి, ఆరాధించినవాడికి పునర్జన్మ ఉండదు.
- కృష్ణపక్ష అష్టమినాడు ధార్మికుడైన బ్రాహ్మణుడికి పాదప్రక్షాళన చేసి విశేషంగా అర్చించి “మహాదేవః ప్రీయతాం' అని సంకల్పం చెప్పుకుని యథాశక్తి ద్రవ్యాన్ని (ధనం) దానం చేయాలి.అలా చేసిన వారికీ ఉత్తమ గతులు కలుగుతాయి.
- బ్రాహ్మణులైన వారు విశేషంగా కృష్ణపక్ష చతుర్దశి, కృష్ణపక్ష అష్టమి అమావాస్య తిథుల్లో శంకరుణ్ణి పూజించాలి
- ఏకాదశినాడు ఉపవసించి, ద్వాదశినాడు బ్రాహ్మణుణ్ణి నారాయణ స్వరూపుడుగా పూజించినవాడు పరమపదాన్ని పొందుతాడు
- శుక్లపక్ష ద్వాదశి శ్రీవిష్ణువుకి ప్రీతికరమైన తిథి కనుక, ఆ తిథినాడు ప్రయత్న పూర్వకంగా నారాయణుణ్ణి అర్చించాలి.
0 Comments