Ad Code

Responsive Advertisement

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం - నందికొట్కూరు

శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం నందికొట్కూరు మండలం , కర్నూల్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువైవుంది.  ఈ ఆలయం రెండవ అరసవిల్లిగా ప్రసిద్ధి చెందింది.

పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా వుండేది. కాకతీయ చక్రవర్తులు ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్ళే సమయంలో ఈ ప్రాంతం నుంచే వెళ్ళేవారు. దారిలో ఈ ప్రాంతంలో అనేక సార్లు విశ్రాంతి కూడా తీసుకుంటూ వుండేవారట, కాకతీయ ఉద్యోగులు, సామంతులుగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ వుండిన వెలనాటి చోళుల్లో ఒకరైన సిరిసింగరాయలు గొప్ప దైవభక్తుడు. ఒకసారి సిరిసింగరాయలు వేటకు బయలుదేరి, వేటాడుతూ మధ్యాహ్న సమయానికి ప్రస్తుత ఆలయ ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక చెట్టు క్రింద విశ్రమించాడు. అలసివున్న రాయలకు నిద్ర పట్టింది. ఈ సమయంలో స్వప్నంలో సూర్యభగవానుడు సాక్షాత్కరించి తనకు ఆలయం నిర్మించి ప్రతిష్టించి పూజలు జరిగే ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. నిద్రనుంచి మేల్కొన్న రాయలు ఈ విషయాన్ని తన సార్వభౌములైన కాకతీయులకు తెలిపి అనుమతి తీసుకుని ఆలయాన్ని నిర్మింపజేసి స్వామివారిని ప్రతిష్ఠించి నిత్యం పలు జరిగే ఏర్పాట్లు చేశాడు.

ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దంలో నిర్మించారు. వందలాది సంవత్సరాలు గొప్పగా పూజలు అందుకున ఆలయం కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 25  సంవత్సరాల క్రితం ఆలయాన్ని సర్వాంగ  సుందరంగా నిర్మించి పూజలు ప్రారంభించారు. 

ఆలయంలో మండపానికి ఇరువైపులా సరస్వతీదేవి, నరసింహస్వామి మూర్తులు వున్నాయి. ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా బలిపీఠం, ధ్వజస్తంభం వున్నాయి. ప్రధాన ఆలయం ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగివుంది ముఖమండపం పైభాగంలోనూ, గర్భాలయ విమానం పైన వివిధ దేవతామూర్తుల శిల్పాలు కన్నులపండుగ చేస్తూ దర్శనమిస్తాయి.ముఖమండపంలో వినాయకుడు కొలువుదీరి తొలిపూజలందుకుంటున్నాడు. 

ఇక ప్రధాన గర్భాలయంలో సూర్యనారాయణస్వామివారు సప్తాశ్వరథం పైన కొలువుదీరి దర్శనమిస్తాడు. స్వామివారు స్థానక భంగిమలో నిలుచుని ద్విభుజాలతో, కుడిహస్తంలో పద్మాన్నీ, ఎడమచేతిలో పద్మంతో కూడిన అభయముద్రను ధరించి దివ్య మనోహరరూపంతో కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. ఈ స్వామివారిని దర్శించి పూజించడం వల్ల సకల వ్యాధులు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది.

ధనుర్మాసంలో ఉత్తరాయణం ప్రారంభం అయ్యేవరకు ప్రతి రోజు సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామివారి పాదాలపై పడతాయి. 

ప్రతి నెల వచ్చే రెండు సప్తమి తిధులనాడు స్వామివారికి విశేష పూజలు చేస్తారు. రథసప్తమి సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయి. ధనుర్మాసం, మకరసంక్రాంతి, వైకుంఠ ఏకాదశి రోజులలో విశేష పూజలు చేస్తారు.


ముఖ్యమైన పండుగలు :

రథసప్తమి
ధనుర్మాసం
సంక్రాంతి
వైకుంఠ ఏకాదశి

ఆలయ వేళలు :

ఉదయం 6  నుండి రాత్రి 9 వరకు.

ఎలా వెళ్ళాలి :

కర్నూలు నుండి 31 కి.మీ దూరం
నందికొట్కూర్ నుండి కిలోమీటర్ దూరం
అమరావతి నుండి 310  కి.మీ దూరం

చుట్టూ ప్రక్కల చూడవలసిన ఆలయాలు :

కాకనూరు సరస్వతి పీఠం - 50 కి.మీ దూరం
అలంపూర్ జోగులాంబ ఆలయం 56  కి.మీ దూరం
మహానంది ఆలయం - 73 కి.మీ దూరం 

Post a Comment

0 Comments