Ad Code

Responsive Advertisement

శ్రీవారి కి జరిగే నిత్యా సేవలు

శ్రీ వైఖానస భగవఛ్ఛాస్త్రోక్త మార్గాన్ననుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి. దీనినే ఆగమ పరిభాషలో షట్కాల పూజ అని అంటారు. అవి... ప్రత్యూష, ప్రాత:కాలం, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాల, రాత్రి పూజలు. తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది.



  • సుప్రభాత సేవ: నిత్యం స్వామివారికి జరిపించే ప్రప్రథమ సేవ ఇదే. నిత్యం తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ మొదలవుతుంది.
  • శుద్ధి: సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది.
  • తోమాలసేవ: ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత రెండవ సారి మరల తోమాలసేవ చేస్తారు.
  • కొలువు: తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు స్నపన మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్‌ జరుగుతుంది. దీనినే శ్రీ వైఖానస భగవచ్చాస్త్రంలో 'యాత్రాసనం' అని కూడా అంటారు.
  • సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి 1008 నామాలనూ స్తుతిస్తూ తులసి దళాలతో చేసే అర్చన ఇది.
  • మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయనమంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండివంటలు) కులశేఖరపడి (పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.
  • అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు.
  • రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట నైవేద్యం జరుగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.
  • రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది.
  • ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు బ్రహ్మది దేవతలు వస్తారని ప్రతీతి. బ్రహ్మది దేవతలు స్వామి వారి ఆరాధన చేయడం కోసం తగినంత నీటిని బంగారు పంచ పాత్రలలో ఉంచుతారు. వారు ఆరాధన చేసిన తీర్ధాన్ని మరుసటి రోజు సుప్రభాతం ముగిసిన తర్వాత భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఏడుకొండలస్వామి పవళింపుసేవలో అన్నమయ్య లాలి సంకీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.
  • ముత్యాల హారతి:ఉత్తర మాడా వీధిలో నివసించే తరిగొండ వెంగమాంబ అనే మహాభక్తురాలు హారతి తీసుకోనిదే బ్రహ్మోత్సవాల సమయంలో ఆమె ఇంటి ముందు నుండి కదలని రథానికి గుర్తుగా ప్రతీరోజూ రాత్రి ఏకాంతసేవ అనంతరం వెంగమాంబని పాట పాడి హారతిని ఇమ్మని భక్తులూ,అర్చకులూ అడిగేవారట కాలక్రమంలో అది ఒక సేవగా స్థిరపడిపోయింది.ఈ సేవనే'తరిగొండ ముత్యాల హారతి'అనేవారు.వెంగమాంబ తరువాత ఆమె దత్తపుత్రిక వారసురాలయ్యింది.అదే పరంపర నేటికీ కొనసాగుతుంది.
  • గుడిమూసే ప్రక్రియ: రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.

Post a Comment

0 Comments