Ad Code

Responsive Advertisement

కలియుగ వైకుంఠం శ్రీరంగం.




నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో ప్రధానమైనది శ్రీరంగం. తమిళనాడులోని తిరుచిరాపల్లికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగక్షేత్రానికి దేశవిదేశాల నుండి భక్తులు తరలివస్తుంటారు. కావేరి నది ఒకవైపు కొల్లిదం నది మరోవైపు ఉన్న ఈ ఆలయం వేల సంవత్సరాల చరిత్ర గలది. 156 ఎకరాల విస్తీర్ణంలో, ఏడు ప్రాకారాలతో, 21 గోపురాలతో సమున్నత శోభతో అలరారే ఈ ఆలయం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఏడు ప్రాకారాలలో నాలుగు ఆలయం లోపల, మూడు ఆలయం బయట కనిపిస్తాయి. అహోబిలమఠం వారు దక్షిణ రాజగోపురాన్ని నిర్మించారు. దీని ఎత్తు 236 అడుగులు. ఇక్కడ కావేరీనదీ జలాలను శ్రీరంగనాథుని సేవకై వినియోగిస్తారు. పదవ శతాబ్ది చోళరాజుల కాలంనాటి శాసనాల ఆధారంగా అప్పటి నుంచే ఆలయంలో సేవలకూ రాజులు కైంకర్యాలను సమర్పించేవారని తెలుస్తోంది. చోళరాజులు బంగారువెండి దీపస్తంభాలను, కైంకర్యసేవలకై అధిక మొత్తంలో విరాళాల్ని సమర్పించారు. ఉడయవర్లుగా పిలిచే తమిళనాడుకు చెందిన భగవద్‌ రామానుజులు ఈ ఆలయం ప్రాంతంలో ఎంతో కాలం ఉన్నట్లుగా చెబుతారు. రామానుజులు కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు పర్యటించి వైష్ణధర్మ ప్రచారం చేశారు. 12వ శతాబ్దంలో సుందర పాండ్యరాజు ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.

ఆలయ గోపురాలకు బంగారు తాపడం చేయించి స్వామికి ముత్యాల హారాన్ని బంగారు గరుడ తోరణాన్ని, పచ్చల పతకాన్ని, బంగారు కిరీటం, బంగారు పాత్రలు, బంగారు శేషవస్త్రం, ఇలా ప్రతిదీ బంగారంతో తయారుచేయించి స్వామివారికి సమర్పించారు. మహమ్మదీయుల కాంలో ఈ ఆలయం దోపిడీకి గురయింది. కాని కొన్ని దివ్యాభరణాల్ని, విగ్రహాలను, అప్పటి వారు తిరుమలకు తరలించి విజయనగరరాజుల కాలంలో భద్రంగా తెచ్చి తిరిగి యధాస్థానంలో ఉంచారు.నమ్మాళ్వారు, కులశేఖర ఆళ్వారు, తిరుమంగై ఆళ్వారుల వంటి వైష్ణవోత్తములు ఈ స్వామి సేవలో తరించారు. పెరియాళ్వారుగా పిలిచే శ్రీ విష్ణుచిత్తుల పెంపుడు కుమార్తె, లక్షీదేవి అంశతో జన్మించిన ఆండాళ్‌ శ్రీరంగనాధుని తన పతిగా భావించి సేవించి, స్వామిలో ఐక్యమైంది. ఈ ఆలయంలోని వేయిస్తంభాల మండపం తీరైన శిల్పాలతో కనువిందు చేస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఇంకా 53 ఉప సన్నిధుల్లో అనేక దేవీదేవతల ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయా లలో శ్రీరంగ నాథుడు శ్రీదేవి భూదేవి సహితంగా శేషుని పడగనీడన శయన ముద్రలో కొలువై ఉంటాడు. రంగనాయచ్చియర్‌ విగ్ర హం విడిగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ గరుడ, నరసింహ, ఆంజనేయ ఆలయాలు ఉన్నాయి. నవగ్రహాలలోఒకటైన శుక్రగ్రహ సంబంధ ఆలయంగా శ్రీరంగాన్ని చెబుతారు.

తమిళ కవి కంబర్‌ ఈ ప్రదేశంలోనే కంబరామాయణాన్ని రాసాడు. ఆలయ స్తంభాలపై రామాయణ విష్ణుపురాణాలకు సంబంధించిన అనేక శిల్పాలు, నాయకరాజుల మూర్తులను చూడవచ్చు. ఏప్రిల్‌, మే నెలల్లో రథోత్సవం, డిసెంబర్‌, జనవరిలో వచ్చే వైకుంఠ ఏకాదశికి జరిగే ఉత్సవాలకు భక్తులు అసంఖ్యాకంగా వస్తుంటారు. మార్గశిరమాసంలో అధ్యయనోత్సవాలు జరుగుతాయి. ఆళ్వారుపాశుర దివ్యపారాయణాలతో ప్రతినిత్యం ఈ ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మార్గశిర మాసం అంటే ధనుర్మాసంలో నారాయయణ దివ్యప్రబంధాన్ని ఆండాళ్‌ రచించిన దివ్య పాశురాలను పారాయణ చేస్తారు. శ్రీరామపట్టాభిషేక సమయంలో విష్ణుమూర్తి కొలువై ఉన్న రంగ విమానాన్ని శ్రీరాముడు విభీషణునికి కానుకగా ఇచ్చాడు. విభీషణుడు ఈ మూర్తిని లంకకు తరలిస్తూ మార్గమధ్యంలో శ్రీరంగంలో ఆగినపుడు ఈ విగ్రహం నేలపై ఉంచరాదని తెలియని విభీషణుడు ఆ విగ్రహాన్ని నేలపై పెట్టగానే అది పైకి రాక అక్కడే స్థాపితమైందని పురాణ కథనం.

శ్రీరంగనాథస్వామి గర్భాలయం పై నున్న విమానం బంగారంతో మలాము చేసి ఉంది. ప్రధాన ఆలయంలో శ్రీరంగనాథస్వామి దివ్యమనోహర విగ్రహం శయనముద్రలో దర్శనమిస్తాడు. పంచముఖ ఆదిశేషుడు నాలుగు వరుసలుగా చుట్టుకొని రంగనాథునికి తల్పంగా కనిపిస్తాడు. స్వామివారి ఉత్సవమూర్తి అత్యంత రమణీయంగా నిలబడిన భంగిమతో, హస్తముద్రలతో, ప్రయోగ చక్రం, శంఖం, అభయముద్రతో ఒక చేతిలో గదను ధరించి హస్త పాద మంజీరాలతో చిరునవ్ఞ్వతో ముగ్ధమనోహరంగా ఉంటుంది. వైష్ణవ దివ్యక్షేత్రాలలో తలమానికమైన శ్రీరంగక్షేత్రానికి పలు రాష్ట్రాల నుండి బస్సు, రైలు మార్గాలు ఉన్నాయి. దగ్గరలోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కూడా శ్రీరంగానికి చేరవచ్చు. కలియుగ వైకుంఠంగా దివ్యక్షేత్రంగా అలరారే శ్రీరంగక్షేత్ర దర్శనం భక్తులకు భక్తి పారవశ్యం, ఆనంద తన్మయత్వాన్ని కలిగిస్తుంది.

Post a Comment

0 Comments