Ad Code

Responsive Advertisement

ధనుర్మాసంలో శివుడికి పాశురాలు

సూర్యుడు ఏడాదిలో ప్రతినెలా ఒక్కో రాశిలో సంచరిస్తుంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటే.. ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. ఆదిత్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి.. మళ్లీ మకర రాశిలోకి వెళ్లే వరకూ ఉన్న సమయమే ధనుర్మాసం. దక్షిణాయనం దేవతలకు రాత్రి. ఉత్తరాయణం పగలు. ఉత్తరాయణం ముందు వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయం.



ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో గోదాదేవి విరచిత తమిళ పాశురాలు వినిపిస్తుంటాయి. శ్రీరంగనాథుడి భక్తురాలైన గోదాదేవి నెల రోజుల పాటు రోజుకో పాశురం చొప్పున కృష్ణలీలల్ని కీర్తిస్తూ శ్రీవ్రతం ఆచరించింది. ఈ 30 పాశురాలు ‘తిరుప్పావై’ పేరుతో ప్రఖ్యాతి గాంచాయి.ధనుర్మాసంలో విష్ణుభక్తులే కాదు, శివభక్తులు కూడా పాశురాలు పాడుకుంటారు. తమిళనాడులోని శివాలయాల్లో తిరువెంబావై పాశురాలు వినిపిస్తాయి. శైవ సిద్ధాంత కర్త మాణిక్య వాచకర్‌ ఈ పాశురాలను రాశారు.

శివ తత్వాన్ని తెలిపే ఈ పాశురాల సంఖ్య కూడా 30. మదురై నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో ఉండేవాడు మాణిక్య వాచకర్‌. చిన్ననాటి నుంచి శివ భక్తుడు. ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారు జామునే మదురైలోని సుందరేశ్వరుడి దర్శనానికి వచ్చేవాడు మాణిక్య వాచకర్‌. నగర వీధుల్లో నడుస్తూ తిరువెంబావై పాశురాలను రాగయుక్తంగా ఆలపించేవాడు. ఆ అమృతగానం విని మదురై వాసులంతా ఆయనతో గొంతు కలిపే వారు. అలా మొదలైన తిరువెంబావైని నేటికీ ఆచరిస్తూనే ఉన్నారు. 

తమకు మంచి భర్త రావాలని ఆకాంక్షిస్తూ ఆడపిల్లలు తిరువెంబావై పాశురాలను పాడుకోవడం పరిపాటి. తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో ధనుర్మాసమంతా సుప్రభాత సేవలో గోదాదేవి పాశురాలు ఆలపిస్తారు. గోదాదేవి కృష్ణభక్తికి ప్రతీకగా శ్రీవారి పవళింపు సేవ రజతకృష్ణస్వామి మూర్తికి నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments