Ad Code

Responsive Advertisement

దుర్గ దేవి స్వరూపాలు

 దసరా నవరాత్రుల తొమ్మిది రోజులలో దుర్గాదేవి స్వరూపాలను పూజిస్తారు. విడివిడిగా ఈ దుర్గారూపాలకు ఆలయాలు లేకపోయినప్పటికీ ప్రసిద్ధ శక్తిక్షేత్రాలలో నవదుర్గలను మనం దర్శించవచ్చు.





శైలపుత్రి 


నవదుర్గలలో అమ్మవారి మొదటి రూపం. అంటే పార్వతి అని అర్ధం. పర్వతరాజైన హిమవంతుడి కుమార్తె. గత జన్మలో దక్షయజ్ఞ సందర్భంలో తనువూ చాలించిన సతీదేవియే శైలపుత్రిగా జన్మించింది అని పూరణలు చెబుతున్నాయి. ఈ తల్లిని నవరాత్రి ఉత్సవాల్లో తొలినాడు అర్చిస్తారు. ఈ అమ్మ కరుణతో సర్వశుభాలు సమకూరుతాయి. వృషభ వాహనాన్ని అధిరోహించి ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటాయి.


నైవేద్యం - కట్టు పొంగలి


మొదటిరోజు - చేమంతి పూలు 


బ్రహ్మచారిణి


బ్రహ్మచారిణికి కుడిచేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం ఉంటాయి. హిమవంతుడికి కుమార్తెగా అవతరించిన తర్వాత పరమేశ్వరుడిని పతిగా పొందాలని బ్రహ్మచర్య దీక్షతో కఠోరంగా తపస్సు చేసింది. ఆమె కోరికను అనుసరించి శివుడు ఆమెనే పెళ్లాడాడు. నవరాత్రి ఉత్సవాల్లో రెండోరోజున బ్రహ్మచారిణి రూపాన్ని అర్చించడం వల్ల అనంత పుణ్యఫలాన్ని పొందవచ్చు. మనిషి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను అధిగమించేందుకు ఈ అమ్మ అనుగ్రహం బాగా ఉపకరిస్తుంది


నైవేద్యం - చిత్రాన్నం లేదా పులిహోర


రెండవ రోజు - గులాబీలు 


చంద్రఘంట


చంద్రఘంటాదేవి శిరస్సున చంద్రుడు ఘంటాకృతిలో ఉంటాడు. చంద్రమండలం నుంచి వెలువడే శబ్దం రాక్షసుల గుండెలను బద్దలుకొడుతూ ఉంటుంది. చంద్రఘంట శరీర కాంతి బంగారు కాంతి లాగా ఉంటుంది. ఈ తల్లికి పది చేతులుంటాయి. పది చేతుల్లోనూ ఖడం, బాణం లాంటి ఆయుధాలు ఉంటాయి. సింహ వాహనం అధిరోహించి ఆమె నిరంతరం రాక్షసులపై యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజున ఈ అమ్మను అర్చిస్తూ ఉంటారు.ఈ అర్చన వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. ఈ తల్లి శీఘ్రఫలాలను ఇస్తుంది.


నైవేద్యం - కొబ్బరి అన్నం లేదా కొబ్బరి పాయసం.


మూడవ రోజు - కనకాంబరాలు 


కూష్మాండ


సునాయాసంగా చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మాండం అంతటినీ సృష్టించిన సందర్భంలో కూష్మాండ అనే పేరు జగదంబకు స్థిరపడింది. సూర్యకిరణ సమాన కాంతులతో అమ్మ వెలుగొందుతూ ఉంటుంది. ఎనిమిది భుజాలతో ఉంటుంది. కనుక అష్టభుజాదేవి అని కూడా అంటారు. ఏడు చేతుల్లో వరుసగా కమండలం, ధనస్సు, బాణం, కమలం అమృత కలశం, చక్రం, గద ఉంటాయి. ఎనిమిదో చేతిలో సర్వసిద్ధులను, నిధులను భక్తులకు అనుగ్రహించేందుకు కావాల్సిన జపమాల ఉంటుంది. కూష్మాండం అనే పదానికి గుమ్మడికాయ అనే అర్థముంది. ఈ తల్లి పూజలో గుమ్మడికాయ వినియోగిస్తూ ఉంటారు. సంసార సాగరాన్ని దాటేందుకు కావాల్సిన శక్తి భక్తులకు కూష్మాండ దేవి సులభంగా అనుగ్రహిస్తుంది. దసరాల్లో నాలుగోరోజున ఈ తల్లిని పూజించాలి.


నైవేద్యం - చిల్లులు లేని మినప గారెలు.


నాలుగవ రోజు - వివిధ వర్ణాలతో వుండే పలు రకాల పూలు. 


స్కందమాత


స్కందుడు అంటే కుమారస్వామి. కుమారస్వామికి తల్లి కనుక స్కందమాత అన్నారు.బాలుడైన స్కందుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని కనిపిస్తుంది ఈ అమ్మ. నాలుగు భుజాలున్న ఈ తల్లి కుడిచేతితో కుమారస్వామిని పట్టుకుని ఉంటుంది. కుడివైపున ఉన్న మరో చేతిలో పైకి ఎత్తిపట్టుకున్న పద్మం ఉంటుంది. ఎడమ వైపున ఉన్న ఒక చెయ్యి అభయ ముద్రతోనూ మరో చెయ్యి కమలాన్ని పట్టుకుని ఉంటుంది. తెల్లటి రంగుతో శోభిస్తూ ఉంటుంది. పద్మం మీద కూర్చొని ఉంటుంది కనుక పద్మాసన అనే పేరు వచ్చింది. స్కందమాత ఉపాసనతో సాధకులు తమ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ స్కందమాతకు చేసే పూజ ఆ తల్లి ఒడిలో ఉండే బాల స్కందుడికి కూడా చేరి ఆయన కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దసరాల్లో అయిదోరోజును ఈ తల్లి ఆరాధనకు కేటాయించారు.


నైవేద్యం - దధ్యోదనం లేదా పెరుగు గారెలు.


ఐదవ రోజు - నీలవర్ణంతో వుండే శంఖు పూలవంటివి.


కాత్యాయని 


కాత్యాయన మహర్షికి కుమార్తె కాత్యాయినీదేవి. ఆమెకు పేరు రావడానికి మరో కారణం కూడా పురాణాలలో కనిపిస్తుంది. మహిషాసురుడు సంహరించడం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సులతో అవతరించిన జగదంబను తొలుత కాత్యాయన మహర్షి అర్చించాడు. కుడి వైపున ఉండే ఒక చెయ్యి అభయ ముద్రతోనూ, మరో చెయ్యి వరద ముద్రతోనూ ఉంటాయి.  సింహ వాహనాన్ని  అధిరోహిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముని పతిగా పొందేందుకు గోకులంలోని గోపికలు యమునా నదీ తీరంలో కాత్యాయనీ పూజ చేశారు. కోర్కెల సాధన కోసం తల్లిని దసరాల్లో ఆరోరోజున ఆరాధించాలి.


నైవేద్యం - కేసరి బాత్ లేదా పెసర పునుగులు.


ఆరో రోజు - పసుపు వర్ణంతో వుండే గన్నేరు వంటివి.


కాళరాత్రి


నల్లటి శరీరంతో, చెల్లాచెదురుగా ఉన్న శిరోజాలతో కనిపిస్తుంది కాళరాత్రి.మెడలోని హారం విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది.గుండ్రటి మూడు కళ్లు ముఖం మీద అలరారుతూ ఉంటాయి. ముక్కు పుటాలు నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయి. గాడిద వాహనంగా ఉంటుంది. కుడి వైపున ఉండే ఓ చేతితో భక్తులకు వరాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. మరో కుడిచెయ్యి అభయ ముద్రతో ఉంటుంది. ఎడమ వైపున ఉండే ఓ చేతిలో ఇనుప ముళ్ల ఆయుధం, మరో చేతిలో ఖడ్గం ఉంటాయి.ఇలా భీకరంగా కనిపించే ఈ తల్లి భక్తులకు శుభాలను కలిగిస్తూ ఉంటుంది. అందుకే ఈమెను శుభంకరి అని కూడా అంటారు. దసరాల్లో ఏడోరోజున తల్లి ఉపాసన వల్ల అగ్ని, జల, జంతు, శత్రు భయాలు అలాగే రాత్రిపూట కలిగే భయాలు నశిస్తాయి.


నైవేద్యం - పలురకాల కూరగాయలతో శాకాన్నం


ఏడవ రోజు - కలువ పూలు.


మహా గౌరీ 


గౌర వర్ణంలో ఉంటుంది. తెల్లటి వస్త్రాలు, కాంతులీనే ఆభరణాలను ధరించి ఉంటుంది. వృషభ  వాహనాన్ని అధిరోహిస్తుంది. ఈమె నాలుగు చేతులో కుడి వైపున ఉండే ఒక చెయ్యి అభయ ముద్రతో మరో చెయ్యి త్రిశూలాన్ని ధరించి కనిపిస్తాయి.ఎడమ వైపున ఉండే ఓ చేతిలో డమరుకం, మరో చెయ్యి వరముద్రతో ఉంటాయి. ఈ తల్లి ఆరాధన వల్ల దీనత్వం దుఃఖం నశిస్తాయి. దసరాల్లో దుర్గాష్టమినాడు మహాగౌరిని ఆరాధించాలి.


నైవేద్యం - చక్కెర పొంగలి లేదా బెల్లం పాయసం.


ఎనిమిదో రోజు : మల్లె జాతులు, మందారాలు , ఎరుపు రంగులో లభించే పూలు. 



సిద్ధిదాత్రి
నవదుర్గల్లో చివరి రూపం సిద్ధిదాత్రి. ఈ మాతను శరణుకోరిన వారికి సర్వ శుభాలు కలుగుతాయి.నియమ నిష్టలతో ఈ తల్లిని ఆరాధించినవారికి అణిమ, లఘిమ ప్రాప్తి, ప్రాకామ్యం , మహిమ, వశిత్వం, సర్వజ్ఞత్వం, దూర శ్రవణం, పరకాయ ప్రవేశం, వాక్సిద్ధి, కల్పవృత్వం, సృష్టి, సంహార కరోనా సామర్థ్యం. అమరత్వం, సర్వ వ్యాపకత్వం, భావన, సిద్ధి అనే సిద్ధులన్నీ సమకూరతాయని పురాణాలు వివరిస్తున్నాయి. దసరాల్లో తొమ్మిదో రోజున ఈ మాతను శరణు వేడాలి.


నైవేద్యం - క్షీరాన్నం లేదా పూల హల్వా.

తొమ్మిదవ రోజు : అన్ని రంగుల పూలు.

విజయదశమి నాడు రాజరాజేశ్వరి, లలిత వంటి ఇష్టదైవాలను పూజించాలి.

Post a Comment

0 Comments