Ad Code

Responsive Advertisement

శ్రీ లక్ష్మి నారాయణ స్వామి వారి ఆలయం - వేపంజేరి


వేపంజేరి లక్ష్మి నారాయణ స్వామి వారి ఆలయం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో వెలసింది. 'వేం' అనగా పాపమని, 'పంచ' అనగా ఐదు, 'హరి' అంటే హరించమనే అర్థం.

స్థలపురాణం

చోళవంశానికి చెందిన మూడవ కుళోత్తుంగ రాజువారి పరిపాలనలో తొండ మండల గ్రామంలో క్రీ.శ. 12వ శతాబ్దంలో శ్రీలక్ష్మీనారాయణ స్వామి స్వయంగా వెలిసాడని చరిత్ర చెపుతుంది. ఓ వైష్ణవ భక్తుని కలలో గోచరించిన శ్రీమన్నారాయణుడు, కుళోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్న సమయంలో తాను సమీపంలోని ఒక పుట్టలో ఉన్నట్లుగా తెలిపాడు. అయితే ఆ భక్తుడు వెంటనే తన కలలో కనిపించిన దృశ్యాన్ని రాజుకు వివరించాడు. దీంతో రాజు రాజ్యంలోని ప్రజల సమేతంగా స్వామి ఉన్న పుట్టకోసం వెదకడం ప్రారంభించాడు. అలా వెతకగా వెతకగా ఓ చిట్టడవిలో ఓ పుట్ట కనిపించింది. దాన్ని తొలగించగా, స్వామివారు, అమ్మవారిని తన తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో శ్రీలక్ష్మీనారాయణుల వారి శిలాప్రతిమ దర్శనమిచ్చింది. వెను వెంటనే ఆ విగ్రహాన్ని ఓ పద్మపీఠంపై ప్రతిష్టింపజేసిన రాజావారు ఓ అద్భుతమైన ఆలయాన్ని కట్టించాడు. 

ఈ స్వామి వారి విగ్రహం సుమారు క్రీ.శ. 1178-1218 కాలం నాటిది. స్వయంగా స్వామి, అమ్మవారితో కలిసి భక్తుల కోరికలను తీరుస్తూ వుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ ఆలయంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు తమ దేవేరులైన సరస్వతి, లక్ష్మి, పార్వతీ సమేతంగా కొలువై వుంటారు. అంతేకాక 27 నక్షత్రాలకు సంకేతంగా 27 వృక్షాలున్నాయి. అంతేకాక పుష్కరిణికి ఉత్తరదిశలో శ్రీవిద్య వినాయక విగ్రహం కూడా వుంది. దీని దగ్గర్లో 18 మెట్లతో అయ్యప్పస్వామి విగ్రహం వుంది. గంగమ్మ, భక్త ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కూడా వుండటం విశేషం. శబరిమలైని తలపించే విధంగా స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇంకా ఈ క్షేత్రంలో 33 అడుగుల ఎత్తుతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి వారి విగ్రహం కూడా ఆకట్టుకుంటుంది.

ఆలయ వేళలు :

ఉదయం 5.00 నుండి రాత్రి 9.00 వరకు

ముఖ్యమైన పండుగలు :

వైకుంఠ ఏకాదశి,హనుమాన్ జయంతి, వినాయక చవితి , దసరా, దీపావళి.

పూజ వివరాలు :

సోమవారం - విద్య వినాయక స్వామి
మంగళవారం - నవగ్రహాలు
శుక్రవారం - అష్టలక్ష్మి దేవతలు
శనివారం - సుదర్శన చక్రతాళ్వార్
ఆదివారం - ఆంజనేయ స్వామి

ప్రతి ఆదివారం రోజు 11.00 గంటలకు  కళ్యాణం జరుగుతుంది.

ఎలా వెళ్ళాలి :

తిరుపతి నుండి 75 కి.మీ దూరం
చిత్తూరు నుండి 15 కి.మీ దూరం

చుట్టూ ప్రక్కల దర్శించవలసిన ఆలయాలు :

కాణిపాకం వినాయక స్వామి ఆలయం - 29 కి.మీ దూరం
సిరిపురం మహాలక్ష్మి ఆలయం - 65 కి.మీ దూరం.

Post a Comment

0 Comments