Ad Code

Responsive Advertisement

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట

తిరుమ‌ల‌లో రెండేళ్ల త‌రువాత శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లను మాడ వీధుల్లో నిర్వ‌హించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌డుతోంది. క‌రోనా కార‌ణంగా గ‌తంలో రెండు బ్ర‌హ్మోత్స‌వాలు శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌కు పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే అమ‌లు చేయాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. అన్నిర‌కాల ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసింది.

బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలను టిటిడి ర‌ద్దు చేసింది. ఆర్జిత సేవలు, రూ.300/- దర్శన టికెట్ల‌తోపాటు శ్రీవాణి ట్ర‌స్టు దాత‌ల‌కు, ఇత‌ర ట్ర‌స్టుల దాతలకు ద‌ర్శ‌న‌ టికెట్లు రద్దు చేశారు. స్వ‌యంగా వ‌చ్చే ప్రొటోకాల్ విఐపిల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంది.

గ‌దుల‌కు సంబంధించి 50 శాతం ఆన్‌లైన్‌లో భ‌క్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గ‌దుల‌ను ఆఫ్‌లైన్‌లో తిరుమ‌ల‌లోని వివిధ కౌంట‌ర్ల ద్వారా భ‌క్తుల‌కు కేటాయిస్తారు. అక్టోబ‌రు 1న గ‌రుడ‌సేవ కార‌ణంగా భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ట్ర‌స్టుల దాత‌ల‌కు, కాటేజీ దాత‌ల‌కు సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబ‌రు 2వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో గ‌దుల కేటాయింపు ఉండ‌దు. దాత‌లు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

అదేవిధంగా ఎంతో ప‌విత్రంగా భావించే పెర‌టాసి మాసంలో బ్ర‌హ్మోత్స‌వాలు రానుండ‌డంతో పెద్దసంఖ్య‌లో భ‌క్తులు తిరుమ‌ల‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, తిరుమ‌ల‌లో గ‌దుల ల‌భ్య‌త ప‌రిమితంగా ఉన్న కార‌ణంగా ఈ విషయాన్ని గమనించి భక్తులు తిరుప‌తిలో గ‌దులు పొంది బ‌స చేయాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Post a Comment

0 Comments