Ad Code

Responsive Advertisement

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త సేవల వివరాలు

అమ్మవారికి ప్రస్తుతం ప్రతిరోజూ నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, అర్చనలు,
అభిషేకాలు, ఆర్జిత సేవలతో పాటు భక్తులకోసం మరికొన్ని విశిష్టమైన పూజలు, సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. వాటి వివరాలు:



రాహుకేతు పూజలు

నవ గ్రహాలలో ఈ రాహువు, కేతువులకు అధిపతి దుర్గమ్మ వారేనని పెద్దలు చెబుతారు. గ్రహస్థితి బాగులేనివారు అమ్మవారి సన్నిధిలో రాహుకేతు పూజలు చేయించుకోవడం వల్ల వారి సమస్యలు పరిష్కారమవుతాయన్న విశ్వాసం ఉంది. ఇప్పటివరకూ శ్రీకాళహస్తిలోనే రాహుకేతు పూజలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఇకపై విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈ సేవలను భక్తులకు అందించబోతున్నారు. మాఘ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా, ఈనెల 6 తేదీ నుంచి ఈ పూజల నిర్వహణ ప్రారంభం అవుతుంది. ప్రతిరోజూ గంటన్నర సమయం రాహుకాలం ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వేళలు మారుతూ ఉంటాయి. రాహుకాలం ఉన్న సమయంలో ఈ పూజలు జరుపుతారు. దీనికి టిక్కెట్టు ధర రూ. 1,000గా నిర్ణయించారు. పూజకు అవసరమైన సామగ్రిని దేవస్థానం అందజేస్తుంది.

  • ఆదివారం సాయంత్రం 4.30 నుంచి 6.00 గంటల వరకు
  • సోమవారం ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు
  •  మంగళవారం మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 గంటల వరకు
  • బుధవారం మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 గంటల వరకు
  • గురువారం మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 గంటల వరకు
  • శుక్రవారం ఉదయం 10.30 నుంచి 12.00 గంటల వరకు
  • శనివారం ఉదయం 9.00 నుంచి 10.30 గంటల వరకు

చతుర్వేద సుప్రభాత సేవ

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజూ తెల్లవారుజామున వెంకటేశ్వర సుప్రభాతంతో శ్రీవారిని ఏవిధంగా మేలుకొలుపుతారో... అదే తరహాలో ఇంద్రకీలాద్రిపైనున్న అమ్మవారిని కూడా చతుర్వేద పారాయణతో మేలుకొలిపేందుకు కనకదుర్గ సుప్రభాత సేవను ప్రవేశపెట్టారు. తెల్లవారుజామున మూడు గంటలకు బయట ప్రధానాలయ గుమ్మం దగ్గర చతుర్వేద పండితులు సుప్రభాతాన్ని వల్లిస్తుండగా, అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం 3.50 నిమిషాలకు హారతి ఇస్తారు. ఆ సమయంలోనే భక్తులకు అమ్మవారి తొలి దర్శనం కల్పిస్తారు. సుప్రభాతసేవలో పాల్గొనే భక్తులకు ఒక్కొక్కరికి టిక్కెట్టు రూ.300లుగా నిర్ణయించారు.

నిలువెత్తు తులాభారం

జగన్మాత కనకదుర్గమ్మ భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా దేవస్థానంలో ఇటీవలే తులాభారాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తులాభారం మొక్కు చెల్లించుకోవచ్చు. భక్తులకు వేదాశీర్వచనం అందించేందుకు ప్రత్యేకంగా ఒక పండితుడిని నియమించారు. భక్తులు తమ కోరికలు తీరితే తమ బరువుకు సరిపోయే ధనాన్నీ, వస్తువులనూ అమ్మవారికి సమర్పిస్తామని మొక్కుకుంటూ ఉంటారు. మొక్కు తీర్చే సమయానికి తమ బరువు ఎంత ఉంటే అంతకు సరితూగేలా అమ్మవారికి ఇష్టమైన బెల్లం, పటిక బెల్లం, పంచ గద్యం (శనగపప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌, బాదంపప్పు, పచ్చిశనగపప్పు), ధనం, వెండి, బంగారం... ఇలా వారి స్థోమత మేరకు సమర్పిస్తారు. సరుకులను తెచ్చుకోలేని భక్తుల కోసం అందుబాటు ధరలకే వాటిని విక్రయించే ఏర్పాట్లు చేశారు.
 
సంప్రదాయ దుస్తులు తప్పనిసరి

సంప్రదాయ దుస్తులలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలనే నిబంధనను ఈ ఏడాది ప్రారంభం నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో మరింత కచ్చితంగా అమలు చేస్తున్నారు. దీని ప్రకారం మహిళలను భారతీయ సంప్రదాయ పద్ధతిలో చీరకట్టు, ఓణీ లేదా చుడీదార్‌, పైజామాల్లో, పురుషులను పంచె, ఉత్తరీయం, సాధారణ ఫ్యాంట్లు, షర్టుల్లో అనుమతిస్తున్నారు. ఇక దేవస్థానంలోనే ప్రత్యేకంగా ఒక కౌంటరును ఏర్పాటు చేసి అమ్మవారి చీరలను రూ. 100 చొప్పున విక్రయిస్తున్నారు.

మరి కొన్ని వివరాలుకు  

ఆలయ వెబ్ సైట్ :www.kanakadurgamma.org

మొబైల్ : 9440011717, 9550087222

Post a Comment

0 Comments