Ad Code

Responsive Advertisement

శ్రీ మోపిదేవి సుబ్రమణేశ్వర ఆలయం - స్థల పురాణం



స్కాందపురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహత్య్మం, మోపిదేవి క్షేత్ర మహిమల గురించి పేర్కొన్నారు. అగస్త్య మహర్షి వింధ్యుడి గర్వమణచడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వారణాసిని వదిలి పెట్టాల్సి వచ్చింది. భార్య లోపాముద్రతో కలిసి అగస్త్యుడు కాశీ నుంచి బయలుదేరాడు. దారిలోని ఉన్న వింధ్యపర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగ నమస్కారం చేసింది. తాను మళ్లీ వచ్చేవరకు అలాగే ఉండాలని శాసించిన అగస్త్యుడు దక్షిణాపథం చేరుకున్నారు. పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పునీతం చేసి, కృష్ణానదీ తీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. 

వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమం, సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్ అనే మాట అప్రయత్నంగా మహర్షి గళం నుంచి వెలువడింది. దీంతో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. మహర్షి వాటిని చూసి ముందుకు వెళుతుండగా లోపాముద్ర దేవి, శిష్యగణం ఆయనను అనుసరించారు. ఒక పుట్ట నుంచి వస్తున్న దివ్యతేజస్సును గమనించిన మహర్షి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, భుక్తి, ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించారు. కుమారుస్వామినే సుబ్రమణ్యుడి పేరుతో పిలుస్తారని మాండవ్యుడనే శిష్యుడి సందేహాన్ని నివృత్తి చేశాడు. పాము రూపంలో తపస్సు చేయడానికి కారణాన్ని వివరించాడు. 

అగస్త్య, సనత్కుమార, సనత్సు దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల ప్రాయం వారిగానే, దిగంబురులై భగవదారధనలో ఉంటారు. ఒకసారి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో శివుడు లేకపోగా, పార్వతి, కుమారస్వామి మాత్రమే ఉన్నారు. అదే సమయంలో లక్ష్మీ, సరస్వతి, శచీ, స్వాహాదేవితోపాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు అందమైన సుందరీమణులను చూసిన కుమారస్వామికి నవ్వు ఆగలేదు. దీన్ని గమనించిన పార్వతి... కుమారా! ఎందుకలా నవ్వుతున్నావు... వారు నాలా కన్పించడం లేదా? ఆ తాపసులు నీ తండ్రిలా లేరా? ఏమైనా భేదం ఉందా? అంటూ ప్రశ్నించింది. తల్లి మాటలకు లోలోన పశ్చాత్తాపం చెందిన కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షమాపణ వేడుకున్నాడు. ఆమె వారించినా వినకుండా తపస్సుకు బయలుదేరాడు. 

ఈ ప్రాంతానికి చేరుకుని ఉరగ రూపంతో పుట్టలో తపస్సు ప్రారంభించాడు. ఆ ప్రాంతమే ఇది అని అగస్త్యుడు శిష్యులకు చెప్పి, దివ్యతేజస్సు వెలువడే పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. తర్వాత కాలంలో ఆ ప్రదేశానికి సమీపంలో వీరారపు పర్వతాలు అనే కుమ్మరి ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. స్వామి అతడికి కలలో కనిపించి, తాను ఉన్న ప్రదేశం గురించి తెలిపి, ఆలయాన్ని నిర్మించి, అందులో ప్రతిష్ఠించమని కోరాడు. అలా ఆయన దేవాలయాన్ని నిర్మించాడు. మట్టితో శివుడికి ఇష్టమైన వాటిని తయారుచేసి ఆలయంలో భద్రపరిచేవాడు. ఈ పుణ్యక్షేత్రాన్ని మోహినీపురంతో పిలిచేవారు. కాలక్రమేణా మోపిదేవిగా స్థిరపడింది. 

Post a Comment

0 Comments