Ad Code

Responsive Advertisement

హరివరాసనం.. విశ్వమోహనం (అర్ధం తో ).

శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు పాత హరివరాసనం. ఈ పాట వింటుంటే మది ఆనంద తాండవం చేస్తుంది. ఈ పాట పాడుతుండగా గర్భాలయంలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తారు.చివరికి ఒక దీపం మాత్రం ఉంచుతారు. 

1950 వ దశకంలో శబరిమల నిర్మానుష్యంగా ఉండేది. ఆ కాలంలో గోపాలమీనన్ అనే భక్తుడు స్వామివారికి ప్రత్యేక పూజల సందర్భంగా ఈ పాటను పారాయణ  చేసేవాడు. గోపాలమీనన్ మరణ వార్త తెలుసుకున్న అప్పటి తంత్రిగా (పూజారి) వున్న ఈశ్వర్ నంబూద్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం గానం చేశాడు. అప్పటి నుండి శబరిమలలో ఆలయం మూసే ముందు ఈ పాట పాడడం సంప్రదాయంగా మారింది.

హరివరాసనం విశ్వమోహనం - హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం నిత్యనర్తనం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

సమున్నతమైన ఆసనాన్ని అధిష్టించినవాడివి, విశ్వాన్ని మోహింపచేసేవాడివి, సూర్యునిచే పాదపూజలందుకునేవాడివి, శత్రులను(ఆత్మశత్రులు, బాహ్య శత్రులు) నాశనం చేసేవాడివి, హరిహరులు పుత్రడవు అయిన ఓ అయ్యప్ప దేవా నీ ఆశ్రయం కోరుతున్నాను.

శరణకీర్తనం శక్తమానసం - భరణలోలుపం నర్తనాలసం
అరుణభాసురం భూతనాయకం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

శరణుగోష చెవిన పడితే చాలు కాపాడాలని తహతహలాడిపోయే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణత నీది. భక్తుల మానస మందిరంలో కొలువుతీరే ఉదారత నీది. ఉత్తమ పాలకుడివి,నాట్యం పట్ల ఎంతో ఆసక్తి గలవాడవి, ఉదయభాస్కరుని వంటి దేహకాంతి కలవాడవి(ఎర్రనివాడివి),భూతనాయకుడివి(జీవులు,పంచభూతాలు ) హరిహరుల పుత్రుడవు అయిన ఓ అయ్యప్ప దేవా నీ ఆశ్రయం కోరుతున్నాను.

ప్రణయసత్యకం ప్రాణనాయకం - ప్రణతకల్పకం సుప్రభాంచితం
ప్రణవమనీద్రం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

సత్యాత్ముకుడవు(సత్యధర్మాలను పాటించేవాడి ఆత్మలో ఉండేవాడివి)చరాచరభూతకోటికి ప్రాణనాయకుడవు, సకల లోకాల సమస్కృతులను అందుకునేవాడవు, మిరుమిట్లు గొలిపే కాంతిమయుడవు , ప్రణవ మంత్రమే మందిరంగా గలవాడవు, కీర్తనలంటే ఇష్టపడేవాడవు ఓ అయ్యప్ప దేవా నీ ఆశ్రయం కోరుతున్నాను.

తురగవాహనం సుందరాననం - వరగధాయుధం వేదవర్ణితం
గురుకృపాకరం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

అశ్వవాహనం గలవాడవు, అందమైన ముఖము గలవాడవు, గద ఆయుధంగా గలవాడవు, వేదాలు వర్ణించినవాడవు, గురువులాగా నిండుగా, హృదయపూర్వకంగా ఆశీర్వదించేవాడవు, కీర్తనలంటే ఎంతగానో ఇష్టపడేవాడవు  ఓ అయ్యప్ప దేవా నీ ఆశ్రయం కోరుతున్నాను.

త్రిభువనార్చితం దేవతాత్మకం - త్రినయనం ప్రభుం దివ్యదేశికం
త్రిదశపూజితం చింతితప్రదం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

ముల్లోకాల పూజలందుకునేవాడవు , దేవతల హృదయాలలో కొలువుదీరి ఉండేవాడవు, సాక్షాత్తు శివుడవు, దివ్యులైన ఉత్తముల చేత పూజలందుకునేవాడవు, త్రికాల పూజలందుకునేవాడవు, తలచినదే తడవుగా కోరికలు తీర్చువాడవు  ఓ అయ్యప్ప దేవా నీ ఆశ్రయం కోరుతున్నాను.

భవభయాపహం భావుకావహం - భువనమోహనం భూతిభూషణం
ధవళవాహనం దివ్యవారణం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

భవభయాలను హరించేవాడవు,కోరిన కోరికలు తీర్చేవాడవు, సకల భువనాలను మోహింపచేసేవాడవు, విబూదిరేఖలను ఆభరణాలుగా ధరించేవాడవు,ఐరావతంపైన ఊరేగేవాడవు ఓ అయ్యప్ప దేవా నీ ఆశ్రయం కోరుతున్నాను.

కళమృదుస్మితం సుందరాననం - కలభకోమలం గాత్రమోహనం
కలభకేసరి వాజివాహనం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

మృదు మధుర మందహాసాలతో అందమైన వదనారవిందంతో అలరించేవాడవు, హరిచందనంతో అలరారేవాడవు, సకలజన సమ్మోహకమైన స్వరసంపదగలవాడవు, మందమతులపాలిట సింహస్వప్నంగా ఉండేవాడవు, వ్యాఘ్రవాహనుడవు ఓ అయ్యప్ప దేవా నీ ఆశ్రయం కోరుతున్నాను.

శ్రితజనప్రియం చింతితప్రదం - శృతివిభూషణం సాధుజీవనం
శృతిమనోహరం గీతలాలసం - హరిహరాత్మజం దేవమాశ్రయే
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

ఆశ్రయించి వచ్చే వారికీ ఆనందం కలిగించేవాడవు, కోరిన కోరికలు తీర్చేవాడవు, వేద ప్రశంసలే ఆభరణాలైనవాడవు, ఆడంబరాలు ఎరుగని జీవన శైలిగలవాడవు, వేదాల హృదయాలను కొల్లగొట్టినవాడవు, దివ్యమైన సంగీతాన్ని కోరుకొనేవాడవు ఓ అయ్యప్ప దేవా నీ ఆశ్రయం కోరుతున్నాను.

Post a Comment

0 Comments