Ad Code

Responsive Advertisement

శ్రీకాళహస్తి - స్థల పురాణం

పూర్వం శివపార్వతుల కల్యాణ సమయంలో దేవతలు భూలోకానికి రావడంతో భూమి ఒక్క పక్కకు వాలింది. శివ ఆజ్ఞ మేరకు అగస్త్య మహర్షి కాళహస్తికి చేరుకొని భూమిపై కాలును అదిమిపట్టి, భూమిని సమంగా ఉండేటట్లు చేసాడు. 

తరువాత శివపార్వతులు ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడి ప్రకృతికి మైమరచి ఇక్కడ కొలువుదీరారు. బ్రహ్మ శాపానికి గురైన ఊర్లనాభుని అనే దేవశిల్పి ఈ జన్మలో సాలెపురుగుగా జన్మించింది. రోజు శివుని పూజించేది, శివుడు సాలెపురుగును పరీక్షించదలచి సాలె గూడును దీపంతో కాల్చివేసాడు. శివుని ఆచ్ఛాదనను కాల్చింది అనే కోపంతో దీపాన్ని మింగబోయి, సాలె పురుగు దీపంలో కాలిపోయింది. అప్పుడూ శివుడు సాలె పురుగుకు సాయుజ్యాన్ని ప్రసాదించాడు.

పూర్వం శివుని ఆభరణమైన ఒక సర్పం తన భార్యవద్దకు వెళ్లి, శివుని అలంకార సమయానికి రాలేక శాపానికి గురై భూలోకంలో పాముగా జన్మించింది. ఆ పాము శ్రీకాళహస్తిలోని వాయులింగాన్ని రత్నాలతో అలంకరించి అర్చించేది. 

పూర్వజన్మలో శివుని సేవకునిగా వుండిన ఒక యక్షుడు ఏమరపాటుతో శివాపచారాన్ని చేసి, శాపాన్ని పొంది, ఏనుగుగా జన్మించి శ్రీకాళహస్తిలోని వాయులింగాన్ని సేవించసాగాడు. 

ప్రతి రోజు పాము అలంకరింపచేసే రత్నాలను తొలగించి, ఏనుగు స్వర్ణముఖి నది జలంతో స్వామిని అభిషేకించి, బిల్వదళాలతో, పూలతో స్వామిని అలంకరించేది.ఇది గమనించిన పాము, ఏనుగును బాధపెట్టడానికి దాని తొండంలోకి దూరింది. ఆ బాధ తట్టుకోలేక ఏనుగు తన తలను కొండకు బాదుకుంది. దాంతో పాము, ఏనుగు రెండు మరణించాయి.  అప్పుడు శివుడు వాటి భక్తికి మెచ్చి వాటిని తనలో ఐక్యం చేసుకున్నాడు.

మూఢ భక్తితో రోజు తన పుక్కిటి పట్టిన నీటితో శ్రీ కాళహస్తీశ్వరుని అభిషేకిస్తూ, శివునికి మాంసాన్ని నివేదించి , చివరకు తన రెండు కన్నులను  కాళహస్తీశ్వరునికి అర్పించి, భక్త కన్నప్ప పేరుతో శివసాయుజ్యాన్ని పొందిన తిన్నని కథ కూడా  ఈ క్షేత్ర సంబంధ గాధగా ఎంతో ప్రసిద్ధి పొందింది. 

Post a Comment

0 Comments