Ad Code

Responsive Advertisement

ఏకవార వ్రతాలు (అగ్ని పురాణం)

ఏకవార వ్రతాలు ఎంతో విశేషమైన శుభఫలితాలనిచ్చే వ్రతాలు. వీటిని ఆచరించటం ద్వారా ఆయురారోగ్యాలు పొందవచ్చు.
  • ఆదివారం నాడు హస్తా లేక పునర్వసు నక్షత్రం ఉన్న రోజు పవిత్రంగా ఓషధులతో కూడిన నీళ్ళతో స్నానం చేసి శ్రాద్ధం ఆచరించాలి. అలాచేసిన వాడు ఏడు జన్మల పాటు రోగాలతో పీడించబడడు.
  • సంక్రాంతి రోజున ఆదివారం వస్తే అది పవిత్రమైన పర్వదినమవుతుంది. ఆ రోజుని ఆదిత్యహృదయం అని వ్యవహరిస్తారు. ఆ పవిత్రమైన రోజున ప్రారంభించి ఒక సంవత్సరం పాటు నక్త వ్రతాన్ని (ఉదయం ఉపవాస ముండి రాత్రి భోజనం చేయటం) ఆచరిస్తే అతడికి సకల కార్యసిద్ధి కలుగుతుంది.
  • చిత్రా నక్షత్ర యుక్త సోమవారం చంద్రుడికి ప్రీతికరమైన రోజు ఆనాడు వ్రతాన్ని ఆచరించిన వాడికి సుఖాలు కలుగుతాయి. 
  • స్వాతీ నక్షత్రం ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి ఏడు మంగళవారాలు నక్త వ్రతం చేసిన వాడికి కుజుడి అనుగ్రహం లభిస్తుంది. అన్ని కష్టాలనుంచీ అతడికి విముక్తి లభిస్తుంది.
  • విశాఖ నక్షత్రయుక్త బుధవారం నాడు మొదలుపెట్టి ఏడు బుధవారాలు నక్తదీక్షని ఆచరిస్తే నష్టాలు తొలగిపోయి వ్యాపారాభివృద్ధి జరుగుతుంది.
  • అనురాధా నక్షత్రంతో ఉన్న గురువారం బృహస్పతి కి ప్రీతికరమైన రోజు. ఆనాడు ప్రారంభించి వరుసగా ఏడు గురువారాలు నక్త వ్రతాన్ని చేసినవాడు గురు గ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతాడు.
  • జ్యేష్ఠా నక్షత్ర యుక్త శుక్రవారం నాడు మొదలు పెట్టి  వరుసగా ఏడు శుక్రవారాలు నక్తదీక్షని ఆచరిస్తే శుక్రగ్రహ దోషాలన్నీ తొలగిపోయి వ్రతం చేసినవాడికి యశస్సు, కీర్తి, ఆకర్షణ పెంపొందుతాయి.
  • శని గ్రహానికి అత్యంత ప్రీతికరమైనది మూల నక్షత్రం ఆ రోజు మొదలు పెట్టి వరుసగా ఏడు శనివారాలు నక్త వ్రతాన్ని ఆచరిస్తే శనిగ్రహదోషాలు తొలగిపోతాయి. ఆయుర్దాయం పెరుగుతుంది.

ఈ నక్త వ్రతాల్ని ఆచరించేవారు ఆయా గ్రహాలకు సంబంధించిన రోజుల్లో ఆయా గ్రహాన్ని పూజించి అష్టోత్తరాది స్తోత్రాల్ని కూడా పఠిస్తే ఫలితం మరింత త్వరగా లభిస్తుంది. వ్రతం పూర్తయిన తరువాత ఆయా గ్రహాలు చెప్పిన దానాల్ని ఇస్తే మరింత శ్రేయస్కరం.

Post a Comment

0 Comments