Ad Code

Responsive Advertisement

పుణ్యనదులు (శివ పురాణం)

  •  భూలోకంలో ఉన్న సింధూనది ప్రాచీనమైనది. ఎంతో పవిత్రమైనది. 
  • శతద్రునది  తీరంలో ఎన్నో పుణ్య క్షేత్రాలున్నాయి.  
  • అరవై ముఖాలతో విలసిల్లే సరస్వతి నది కూడా చాలా గొప్పది. వివేకం కలిగిన మానవులు ఈ నదీ తీరంలో నివసిస్తే బ్రహ్మలోకాన్ని పొందుతారు.
  • ఇక పవిత్రమైనది గంగానది. హిమాలయాల్లో జన్మించిన ఆ నది వంద ముఖాలతో ప్రవహిస్తుంది.
  • ఆ నదీతీరంలో కాశీ వంటి ఎన్నో పుణ్య క్షేత్రాలున్నాయి. సూర్యుడు సింహరాశిలో ఉండగా ఆ దివ్య క్షేత్రంలో నివసిస్తే ఎంతో పుణ్యప్రదం.
  • శోణభద్రానది కూడా ఎంతో గొప్పది. బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఆ దివ్య నదిలో స్నానం చెయ్యాలి అక్కడ నివసించాలి అత్యంత పవిత్రమైన ఈ శోణభద్ర పదిముఖాలతో ప్రవహిస్తుంది. 
  • ఈ నదీతీరంలో నివసించే మానవుడు అక్కడ జప తపాలు దానధర్మాలు ఆచరిస్తే వినాయక పదాన్ని చేరతాడు.
  • నదుల్లో విశిష్టమైనది నర్మదానది. ఇది ఇరవై నాలుగు ముఖాలతో ప్రవహిస్తుంది. ఈ నదీతీరంలో నివసించి స్నానాదులు ఆచరిస్తే, విష్ణుపదం లభిస్తుంది.
  • మహా పవిత్రమైనది గోదావరి. ఇది గోహత్యా బ్రహ్మ హత్య పాపాల్ని కూడా పోగోడుతుంది. ఇరవై  ఒక్క ముఖాలతో పరవళ్ళు తొక్కే గోదావరి మానవులకు రుద్రపదాన్ని అందిస్తుంది.
  • కృష్ణవేణి నది కూడా పరమపవిత్రమైన పద్దెనిమిది ముఖాలతో ప్రవహిస్తూ తన తీరంలో జపతపాదులు చేసిన వారికి, తనలో స్నానమాచరించిన వారికి విష్ణులోకాన్ని ప్రసాదిస్తుంది.
  • పది ముఖాలతో ప్రవహించే తుంగభద్ర బ్రహ్మ లోకాన్ని అందిస్తుంది.
  • సువర్ణముఖీనది ఇది తొమ్మిది ముఖాలతో ప్రవహిస్తుంది. ఇది ఎంత గొప్పదంటే బ్రహ్మలోకంనుంచి క్రిందపడే అనగా పుణ్య శేషం అయిపోయి తిరిగి జన్మించే మానవులు ఈ సువర్ణముఖీనది తీరంలోనే జన్మిస్తారు.
  • సరస్వతి నది  పంపా సరోవరం అత్యంత శుభప్రదమైన కన్యానదీ తీరాల్లో ఎవరైతే నివసిస్తారో వారందరూ ఇంద్రలోకానికి చేరతారు.
  • సహ్య పర్వతంలో పుట్టిన కావేరినది, చాలా పవిత్రమైనది. మానవుల కోరికలు తీర్చే ఈ దివ్య నది ఇరవైఏడు ముఖాలతో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర నదీతీరంలో జపతపాలు ఆచరించిన వాళ్ళకి స్వర్గలోకం, బ్రహ్మపదం, విష్ణుపదం లభిస్తాయి. ఈ నదీతీరంలో కామిత ఫలాలందించే ఎన్నో దివ్య శైవ క్షేత్రాలున్నాయి. 
  • బృహస్పతి మేషరాశిలో ఉన్నప్పుడు, నైమిషంలో, బదరీ క్షేత్రంలో స్నానం చెయ్యాలి. అలా స్నానంచేసి ఆ క్షేత్రాల్లో పూజలు, జపతపాలు చేస్తే  బ్రహ్మలోకప్రాప్తి కలుగుతుంది.
  • సూర్యుడు సింహరాశిలో లేదా కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సింధూనదిలో స్నానం అదే సమయంలో కేదార క్షేత్రంలో కేదార స్నానం ఆచరించి అక్కడి నీళ్ళు తాగితే దివ్య జ్ఞానం కలుగుతుంది.
  • భాద్రపద మాసంలో బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదిలో స్నానం చేస్తే శివలోకం లభిస్తుందని సాక్షాత్తు పరమశివుడే పూర్వం చెప్పాడు. 
  • గురువు, రవి ఇద్దరూ కన్యారాశిలో ఉన్నప్పుడు యమునా, శోణా నదులలో స్నానాన్ని ఆచరిస్తే ఆవ్యక్తికి ధర్మ లోకంలో, వినాయక లోకంలో ఎన్నో భోగాలు లభిస్తాయి. 
  • బృహస్పతి-రవి తులారాశిలో ఉన్నప్పుడు కావేరి నదిలో చేసే స్నానం వల్ల మానవులకి కోరిన కోరికలన్ని సిద్ధిస్తాయని సాక్షాత్తు విష్ణు భగవానుడే ప్రకటించాడు. 
  • మార్గశిర మాసంలో రవి బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు నర్మదా నదిలో స్నానం చేస్తే విష్ణులోకం లభిస్తుంది.
  • గురువు-రవి ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు సువర్ణముఖిలో స్నానం చేస్తే శివలోకం లభిస్తుందని బ్రహ్మ దేవుడే చెప్పాడు.
  • మాఘమాసంలో రవి కుంభ రాశిలో ఉన్నప్పుడు గంగానది తీరంలో శ్రాద్ధంగానీ, పిండప్రదానం గానీ, తిలోదకాలు సమర్పించటం చేస్తారో వారి రెండు వంశాలకు చెందిన పితురులు,పితామహులు కోటి తరాల వరకు ఉద్దరింపబడుతారని మహర్షులు చెప్పారు.
  • బృహస్పతి-రవి మీన రాశిలో ఉండగా కృష్ణానదిలో స్నానం చాలా ప్రశస్తమైనది.
  • జ్ఞానులైన వారు పండితులు గంగా తీరంలో గానీ కావేరీ తీరంలో గానీ నివశించాలి. అలా నివాసముంటే వారు చేసిన పాపాలన్ని నశిస్తాయి.
  • భూలోకంలోని నదుల్లో తామ్రపర్ణి-వేదవతి నదులు తమ తీరంల్లో నివసించే వారికి బ్రహ్మ లోక ఫలాన్ని అందిస్తాయి. ఈ రెండు నదుల పరివాహక ప్రాంతాలలో స్వర్గలోకాన్ని ప్రసాదించే మహా దివ్య క్షేత్రాలున్నాయి. 
  • మానవులందరూ సర్వ కాలాల్లో సత్పవర్తన, ధర్మబుద్ధి, దయాగుణం అలవర్చుకుని ఈ దివ్య క్షేత్రాలలో అవకాశమున్న ఏదో ఒక క్షేత్రంలో నివశించాలి. ఆలా నివసిస్తే సత్ఫలం లభిస్తుంది.


Post a Comment

0 Comments