Ad Code

Responsive Advertisement

మార్గశిర మాసం (స్కాంద పురాణం)

 


మాసానాం మార్గశీర్షోహం' అని విష్ణు భగవానుడు స్వయంగా చెప్పిన మాట ఇది. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది మార్గశీర్ష మాసం. ఈ మాసంలో ప్రాతః కాలంలోనే నిద్రలేచి విధిగా ఆచమనం చేసి, గురువులకి నమస్కరించి ఎలాంటి బద్దకం లేకుండా శ్రీహరిని స్మరిస్తూ విష్ణు సహస్రనామాల్ని పారాయణ చేయాలి. తరువాత మౌనంగా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయాలి.

తరువాత పరిశుభ్రమైన వస్త్రాలు, ఊర్ధ్వపుండ్రాలు(నామాలు) ధరించి యథావిధిగా షోడశోపచారాలతో శ్రీహరిని పూజించాలి. పూజలో ప్రధానంగా తులసీ దళాన్ని ఎక్కువగా ఉపయోగించాలి. ఎందుకంటే తులసి అంటే శ్రీహరికి ఎంతో ఇష్టం గనుక.


తులసీదళాలు

  • తులసిచెట్టు కొమ్మలతో నూరిన గంధాన్ని శ్రీహరికి సమర్పిస్తే వందజన్మల్లో చేసిన పాపం పోతుంది.
  • మార్గశీర్ష మాసంలో శ్రీహరికి తులసిని, తులసీచందనాన్ని సమర్పించిన వాడికి సకల కోరికలు తీరుతాయి.
  • మార్గశీర్షంలో తులసీ దళాలతో పాటు ఉసిరిక దళాలు కూడా ఉపయోగించి శ్రీహరిని పూజించేవాడు వైకుంఠానికి చేరుకుంటాడు.
  • తులసీదళాల్ని ఉపయోగించి లక్ష్మీనారాయణ పూజచేసిన వాడికి శ్వేతద్వీప నివాస ప్రాప్తి కలుగుతుంది.
  • తులసీ దళాలు, గంగాజలం నిల్వ ఉన్నప్పటికీ అవి అపవిత్రం కావు.


ధూపం 


  • శ్రీహరికి అత్యంత ప్రీతి పాత్రమైనది ధూపం. ఇది చేసిన పూజని పవిత్రం చేస్తుంది.
  • మార్గశీర్షంలో దశాంగ ధూపాన్ని శ్రీహరికి సమర్పిస్తే అత్యంత దుర్లభమైన కోరికలు కూడా తీరిపోతాయి.
  • నల్లని అగరుతో ధూపం వేసిన వాడు శ్రీహరి అనుగ్రహంతో నరకబాధని తప్పించుకుంటాడు.
  • గుగ్గిలం, గేదెనెయ్యి, చక్కెర కలిపి శ్రీహరికి ధూపం సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయి.
  • సాలవృక్షం జిగురుతో శ్రీహరికి ధూపం వేస్తే యక్షరాక్షసులు నశిస్తారు.


దీపం - హారతి 


  • మార్గశీర్ష మాసంలో ఆవునెయ్యితో దీపాన్ని వైష్ణవాలయంలో వెలిగించాలి లేదా స్వగృహంలో పూజామందిరంలోనైనా దీపారాధన చేయవచ్చు.
  • శ్రీహరి సన్నిధిలో దీపదానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి.
  • ముద్ద కర్పూరంలో శ్రీహరికి మంగళ హారతిని సమర్పించాలి.
  • మార్గశీర్షంలో శ్రీహరికి కర్పూర హారతి సమర్పించిన వాడు అశ్వమేధయాగ ఫలితాన్ని పొందుతాడు.


మార్గశీర్షమాసంలో భగవంతుడైన శ్రీకృష్ణుడి దివ్యనామాన్ని నిరంతరం స్మరించాలి. కృష్ణ నామం అందర్నీ తరింపచేస్తుంది. 


ఎవరైతే ఒక్కసారి కృష్ణా! కృష్ణా! అంటూ నన్నే ప్రతిరోజూ స్మరిస్తారో వారు కమలాలు ఏవిధంగా నీళ్ళని ఛేదించుకుని బైటికి వస్తాయో అలాగే కృష్ణ నామం చేసిన వాడిని నేను నరకం నుంచి బైటికి తీసుకొస్తాను” అని సాక్షాత్తు నారాయణుడే చెప్పాడు. కనుక కృష్ణనామం అనేది ఎంతో గొప్పదని గ్రహించి నిరంతరం స్మరించాలి.


ఎవరైతే కృష్ణనామాన్ని శ్రద్ధగా జపిస్తాడో అతడు పాపి అయినప్పటికీ నరకాన్ని చేరడు.


మార్గశీర్షంలో విశేషంగా స్మరించాల్సిన నామం కృష్ణనామం. ఈ నామాన్ని అశ్రద్ధగా చేసినా, నిర్లక్ష్యంగా చేసినా, హాస్యానికి చేసినా, ఎలా చేసినా చేసినవారికి పుణ్యఫలం దక్కుతుంది.


మార్గశీర్షంలో ప్రాతఃకాలంలో ఎవరు కృష్ణ నామాన్ని జపిస్తారో లేక భజనగా చేస్తారో వారికి సంపూర్ణమైన ఆయుష్షు, ఆరోగ్యం పెంపొందుతాయి.


Post a Comment

0 Comments