Ad Code

Responsive Advertisement

కార్తీకమాస మహత్యం (స్కంద పురాణం)

 


దీపారాధన 

  • కార్తీకమాసంలో శివాలయ గోపురంలో, ద్వారం దగ్గర, శిఖరం మీద శివలింగం సన్నిధిలో దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి.
  • ఎవరైతే కార్తీక మాసంలో ఆవునేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ విప్పనూనెతో గానీ, నారింజనూనెతో గానీ శివాలయంలో భక్తిగా దీపారాధన చేస్తారో వారు సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందుతారు.
  • కేవలం ఆముదంతో కార్తీక దీపాన్ని వెలిగించినా అఖండమైన పుణ్యం లభిస్తుంది
  • కార్తీక మాసంలో యోగ్యుడైన విప్రుడికి దక్షిణతో సహా దీపదానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది.


వన భోజనం 

  • కార్తీకమాసంలో చేసే వనభోజనం చాలా విశేషమైన ఫలితాన్నిస్తుంది.
  • ఎన్నో రకాల  వృక్షాలతో వున్న వనంలోకి వెళ్ళాలి. అక్కడ ఉసిరి చెట్టు తప్పకుండా ఉండాలి.
  • ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామాన్ని ఉంచి గంధపుష్పాక్షతలతో యథావిధిగా పూజించాలి. 
  • ఆ తరువాత శక్తికొద్దీ విప్రుల్ని దక్షిణ తాంబూలాలతో తగిన విధంగా సత్కరించి తరువాత భోజనం చేయాలి.
  • ఈ విధంగా శాస్త్ర బద్ధంగా కార్తీకమాస వనభోజనాన్ని చేస్తే సకల పాపాలూ నశించి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది


గీతాపారాయణం


  • కార్తీకమాసంలో శ్రీహరి సన్నిధిలో భగవద్గీతని పారాయణ చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుంది.
  • కార్తీకంలో భగవద్గీతలోని విభూతి యోగం, విశ్వరూపయోగం అనే అధ్యాయాల్ని వైష్ణవాలయాలల్లో పారాయణ చేస్తే శ్రీహరి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది.


హరిసన్నిధిలో దీపారాధన


  • కార్తీకమాసంలో సాయంత్రంపూట వైష్ణవాలయంలో దీపారాధన చేసేవారు ఉత్తమ గతుల్ని పొందుతారు
  • కార్తీకమాసంలో శ్రీహరి సన్నిధిలో దీపదానం చేసిన వారు గొప్ప జ్ఞానాన్ని పొందుతారు
  • ఆవునెయ్యితో దీపారాధన చేసి యోగ్యుడైన విప్రుడికి దక్షిణతో సహా దీపాన్ని దానం చేయాలి.


కార్తీక ద్వాదశి 


కార్తీకమాసంలో సోమవారం ఎంతో విశేషమైనది. దానికన్నా శనిత్రయోదశి గొప్పది. దానికన్నా గొప్పది కార్తీకపూర్ణిమ. పూర్ణిమకన్నా శుక్లపక్ష పాడ్యమి విశేషమైనది, దీనికన్నా కార్తీకమాసం చివరి ఏకాదశి విశేషమైనది. ఈ చివరి ఏకాదశికన్నా విశిష్టమైన రోజు కార్తీక బహుళ ద్వాదశి.


  • కార్తీక మాసంలో ద్వాదశినాడు అన్నదానం చేస్తే సకల సంపదలు వృద్ధి చెందుతాయి
  • సూర్యగ్రహణం నాడు గంగాతీరంలో కోటిమందికి అన్నదానం చేసిన ఫలితం, కార్తీక ద్వాదశినాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కలుగుతుంది.
  • వేయి గ్రహణాలు, పదివేల వ్యతీపాత యోగాలు, లక్ష అమావాస్యలు కార్తీక ద్వాదశికి సరిరావు.
  • కార్తీక ద్వాదశినాడు వస్త్రదానం చేసేవాడు పూర్వజన్మలో చేసిన పాపాలు నశింపచేసుకుంటాడు.


కార్తీకమాస విధులు


కార్తీక మాసంలో శివప్రీతి కోసం సోమవార వ్రతాన్ని ఆచరించాలి. 


కార్తీక సోమవారం నాడు చేసిన స్నానం, జపం, ధ్యానం, హోమం, దానం  ఇవన్నీ వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్నిస్తాయి.


కార్తీకమాసంలో 


1.ఉపవాసం 

2.ఏకభుక్తం 

3.రాత్రి భోజనం 

4.అయాచిత భోజనం 

5.స్నానం 

6.తిలదానం 


అనే ఈ ఆరుక్రియలూ ఉపవాసంతో సమానమైనవిగా చెప్పబడ్డాయి.

Post a Comment

0 Comments