Ad Code

Responsive Advertisement

శమీ వృక్ష విశేషం

జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో దాచుకుంటారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది విశ్వసిస్తారు.

శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది.సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు.

'శమీ పూజ' చేసుకునే  రోజు మరింత ముఖ్యమైనది. శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్నపాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు . అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుదములను ,వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు .

'శ్రీ రాముడు'  విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు . అదేంటంటే, శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి, నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా, ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని, శ్రీరామునికి విజయాన్ని కల్గజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.


'శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.

శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,

ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.

కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,

తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.'


పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.

శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.

తెలంగాణాలో ఈ పూజ అనంతంరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇండ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం' అని చెప్పి పెట్టి, వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక.

Post a Comment

0 Comments