Ad Code

Responsive Advertisement

శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయం - కొల్లూర్

 


ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా లోని అందమైన కొండలు లోయలు ఫల వృక్షాల మధ్య కొల్లూరు లో వెలసింది. ఈ ఆలయం కర్ణాటకలోని ఏడు ముక్తిక్షేత్రాల్లో ఒకటి.

ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మ వారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండటం. ఆదిశంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. 

కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్షం అయ్యారట. ఆదిశంకర్యాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట. శంకరాచార్యుల కోరిక మన్నించిన అమ్మవారు.. షరతు విధించింది. నీ వెంట వస్తాను కానీ వెనక్కి తిరిగి చూడకూడదని...అలా వెనక్కి తిరిగి చూస్తె చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని చెప్పింది అమ్మవారు. ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మ ఆయన్ని అనుసరించింది. అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు ఠక్కున వెనక్కు తిరిగి చూశారట. అలా మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్టించమని చెప్పి శిలగా మారిపోయంది. 

శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది.మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైనా హారతి సమయంలో అమ్మవారి దివ్యమంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. 

మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని ప్రతీతి. కేరళవాసులు ఎక్కువశాతం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో వుంది. మూకాంబిక ఆలయంలో తేనెని ఉపయోగించి తయారు చేసే "పంచకడ్జాయం' అనే ప్రసాదం ప్రత్యేకం. పూర్వం ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాత, ఆలయంలో ఉన్న ఒక బావిలో వేసేవారట. ఇదంతా చూసిన చదువురాని కేరళ నివాసి ఒకడు ఆ ప్రసాదం తినాలన్న కోరికతో బావిలో దాక్కుని ఆ ప్రసాదం తిన్నాడట. ఆ తర్వాత అతడు మహా పండితుడు అయ్యాడని చెబుతారు. అందుకే ఈ ఆలయం కర్ణాటకలో ఉన్నప్పటికీ కేరళవాసులకు అపారమైన నమ్మకం. 

ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి వ్యసనాలు అయినా దూరం అయిపోతాయని చెబుతారు. ఆ తల్లికి నివేదించిన ప్రసాదం స్వీకరిస్తే మహాపండితులు అవుతారని, అనారోగ్యం తొలగిపోతుందని విశ్వాసం.

Post a Comment

0 Comments