Ad Code

Responsive Advertisement

శ్రీ నటరాజ స్వామి వారి ఆలయం - చిదంబరం



పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశ లింగం తమిళనాడు చిదంబరంలో కొలువుతీరింది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ....మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది.


ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగానే కనిపించినట్టే మూలవిరాట్ ఉండాల్సిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది. ఈ వెనుక ఏమీ ఉండదని తెలిసినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనడం మొదలెట్టారు. దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా...  దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ : శివ – భగవంతుడు, అహం – నేను/మేము, భవ – మన స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ. అందుకే చిదంబర రహస్యం అంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు..అజ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందుతాడు. 


చిదంబరం ఆలయంలో అద్భుతం ఇదే..


  • మానిషికి న‌వ రంధ్రాలు ఉన్నట్టే చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి
  • మానిషి రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు..ఇందుకు సూచికగా చిదంబరం దేవాలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు.
  • ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది.
  • చిదంబ‌రం దేవాలయంలో "పొన్నాంబళం" కొంచెం ఎడమ వైపు ఉంటుంది. అది మన హృదయ స్థానం. అక్కడకి వెళ్ళడానికి "పంచాక్షర పడి" ఎక్కాలి. అది న+మ+శి+వ+య పంచాక్షరిని సూచిస్తుంది.
  • "కనక సభ"లో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు.
  • పొన్నాంబళంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు
  • 9 కలశాలు 9 రకాల శక్తికి, అర్ధ మంటపంలోని 6 స్తంభాలూ 6 శాస్త్రాలకు ప్రతీక
  • ప‌క్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలూ 18 పురాణాలకి సూచిక


ఇక్కడ లింగ దర్శనం ఉండదు..అంతా శూన్యమే. నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. (అందుకే చిదంబర రహస్యం అని అంటారు).

Post a Comment

0 Comments