Ad Code

Responsive Advertisement

నిజమైన భక్తి - 1

పూర్వం ఉజ్జయినీ సామ్రాజ్యాన్ని ధర్మపాలుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజును మూడు ప్రశ్నలు వేదిస్తూ ఉండేవి. మహా పండితులను అడిగినా ఆ ప్రశ్నలకు జవాబులు లభించలేదు. ఒకనాడు బదరీ క్షేత్రం నుంచి ఒక మహాయోగి.. తమ రాజ్యంలోకి వచ్చాడని రాజుకు తెలిసింది. యోగి బస చేసిన ఆశ్రమానికి వెళ్లి తాను అడగదలచిన ప్రశ్నలను ఒక చీటీపై రాసి ఇచ్చాడు రాజు. ఆ ప్రశ్నలను చూసిన యోగి.. మరుసటి రోజు తానే స్వయంగా రాజ ప్రాసాదానికి వచ్చి సమాధానం చెబుతానన్నాడు. రాజు సంతోషంగా ఇంటికి వెళ్లిపోయాడు.



మర్నాడు ఉదయం యోగీశ్వరుడు రాజ ప్రాసాదానికి వచ్చాడు. మహారాజు ఆయన్ని సాదరంగా ఆహ్వానించాడు. సింహాసనం పక్కనే ఉచిత ఆసనం ఇచ్చి కూర్చోమన్నాడు. ‘మహానుభావ! నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి’ అన్నాడు రాజు. అప్పుడు యోగి.. ‘రాజా! తెలియని విషయం చెప్పేవాడు గురువుతో సమానం. ఇప్పుడు నేను నీ గురుస్థానంలో ఉన్నాను. కాబట్టి నా స్థానం నీకన్నా ఉన్నతంగా ఉండాలి. కనుక, నీ సింహాసనంలో నేను కూర్చుంటాను’ అన్నాడు. ‘దానిదేం భాగ్యం’ అంటూ తన సింహాసనంలో యోగిని కూర్చొమన్నాడు రాజు. తర్వాత ఒక దీపాన్ని వెలిగించాల్సిందిగా ఆజ్ఞాపించాడు యోగి. ఒక గ్లాసులో పాలు తీసుకురమ్మన్నాడు. అలాగే చేశాడు రాజు.
‘రాజా! నీ మొదటి ప్రశ్న.. దేవుడు ఎక్కడ అనే కదా! ఇందాక తెచ్చిన పాలల్లో.. వెన్న ఎక్కడుందో చూపించ’మన్నాడు యోగి.

రాజు పాలు చూసి.. ‘పాలల్లో వెన్న మొత్తం ఆవరించి ఉన్నది’ అని బదులిచ్చాడు రాజు.
‘భగవానుడు కూడా సర్వవ్యాపకుడు. ఈ విశ్వంలో అణువణువులో ఉన్నాడు’ అని బదులిచ్చాడు యోగి!
‘నీ రెండో ప్రశ్న.. దేవుడు ఎటు చూస్తున్నాడని కదా? ఇందాక నువ్వు వెలిగించిన దీపం ఎటు వైపు చూస్తోంది చెప్పుమ’న్నాడు యోగి.
దీపాన్ని పరికించి చూసి.. ‘అన్ని దిక్కులనూ చూస్తోంది’ అని బదులిచ్చాడు రాజు.
‘దేవుడు కూడా అంతే అన్ని దిక్కులనూ చూస్తాడు’ అని తెలియజేశాడు యోగి.
రాజు ఉత్సుకతతో.. ‘నా మూడో ప్రశ్న.. దేవుడు ఇప్పుడేం చేస్తున్నాడని? దానికి కూడా సహేతుకుమైన బదులివ్వండి’ అని కోరాడు రాజు.

యోగి నవ్వుతూ.. ‘ఇందాక గమనించలేదా రాజా! నేల మీద ఉన్నవాణ్ణి సింహాసనంలో కూర్చోబెడతాడు. సింహాసనంలో ఉన్నవాణ్ణి నేల మీదకు తీసుకువస్తాడు. అరిషడ్వర్గాలకు లోబడకుండా.. ధార్మిక చింతన కలిగి, సత్యధర్మాలను అనుష్ఠానం చేసే వాడిని దేవుడు ఎల్లకాలం కాపాడతాడు’ అని వివరించాడు యోగి. ఆ సమాధానంతో తృప్తి చెందిన రాజు.. ధర్మబద్ధంగా పరిపాలన సాగిస్తూ.. అందరి మన్ననలూ పొందాడు.

 ఇంటర్నెట్ నుంచి సేకరించింది.

Post a Comment

0 Comments