Ad Code

Responsive Advertisement

ఆరు రుతువులు - మానవ జీవితం

ఆరు రుతువులకు, మానవజీవితానికి అవినాభావ సంబంధం ఉంది. రుతుగతులే మనిషికి పురోగతులు. అనుభూతులకు ఆలవాలమైన శ్రుతులు. ఉల్లాసనర్తనానికి ఆలంబనాలైన జతులు.

వసంతంలా మనిషి జన్మిస్తాడు. శైశవం చిగురులాంటిది. అది పల్లవించగానే జీవన వికాసం ఆరంభమవుతుంది. ఉల్లాసాలు హరితపత్రాలవుతాయి. ఆశలు మొగ్గతొడుగుతాయి. కాంక్షలు కాయలవుతాయి. లక్ష్యాలు ఫలాలవుతాయి. ప్రకృతిలోని మనోహరచిత్రంలా బాల్యమంతా సమ్మోహనాత్మకమై అలరారుతుంది. ఆనందాలు వసించడమే వసంతమవుతుంది.

గ్రీష్మంలా కౌమారదశ ఉజ్జ్వలిస్తుంది. మేధాశక్తి ప్రచండ సూర్యుడిలా భాసిస్తుంటే ప్రతిభాతిశయాలు సూర్యకాంతుల్లా దశదిశలా పరచుకొంటాయి. ప్రతాపం ప్రచండభాస్కర సమానమై లోకాన్ని అబ్బురపరుస్తుంది. వేసవి తాపంలో చల్లని చెట్ల నీడల్లా సుగుణ సంపదలు సేదదీరుస్తాయి.

వర్షాల్లా అభ్యుదయపరంపరలు కురుస్తూనే ఉంటాయి. ఉద్యమాల మేఘగర్జనలు, ఉత్సాహాల మెరుపులు అంతటా నిండిపోయి హర్షాలకు ఆలవాలమై వర్షాలకు వర్షాలే పరుగులు తీస్తుంటాయి. కొత్తనీటి తరగల్లా వినూత్నాలోచనలు ప్రవాహంలా ముందుకు సాగిపోతాయి. సాధన జలాలతో సంకల్పాల చెరువులు నిండిపోతాయి. బతుకు పొలంలో సాగు మొదలవుతుంది. ఆశయాల విత్తనాలను చల్లడం, అప్రమత్తతతో కృషి చేయడం నిత్యకృత్యమవుతుంది.

శరత్తులా యౌవనపు వెన్నెల కాస్తుంది. మనసు నిర్మలాకాశమవుతుంది. కన్నుల్లో అందాల తారకలు తళుకులీనుతుంటే బతుకు శరత్పూర్ణిమలా వెలుగుతుంది. శారదరాత్రుల్లో యుగళగీతాలు స్వచ్ఛజలపాతాలై ప్రవహిస్తాయి. వెన్నెలరాత్రులు మధురోహలకు చోటిచ్చే నదీ తీరాల ఇసుకతిన్నెలవుతాయి. హృదయం నిండా పండువెన్నెలలు పరచుకొని, భావగీతాలను పలికిస్తాయి. జీవితం అంటే ఇంత మధురంగా ఉంటుందా అనుకొనే తీరులో కాలం తేరుపై ఊరేగుతుంది.

హేమంతంలా వార్ధక్యం వణికిస్తుంది. తెలియకుండానే ముదిమిచలి శరీరాన్ని కప్పివేస్తుంది. అడగకుండానే తనువు ముడతలు దేరుతుంది. వయోభారం అనే మంచు మేనును కప్పివేస్తుంది. ముదిమిచలికి వణుకుతున్న మనసు ముసుగువేసుకొని పడుకొంటుంది. సుదీర్ఘానుభవాలతో పరిసరాలన్నీ చల్లబడతాయి. చేదు అనుభవాల పొగమంచు మనసును కప్పివేస్తుంది. అందుకోలేకపోయిన కోరికలన్నీ గడ్డకట్టుకొనిపోతాయి. చేరుకోలేక ఆగిన ఆశలు దూరపుకొండలవుతాయి. చేరుకోలేని హిమగిరిలవుతాయి.

శిశిరంలా కోరికలు ఆకులు రాలిపోతుంటాయి. అన్నింటినీ వదిలించుకోవడమే ఆనందమని తెలుస్తుంది. కప్పివేసినవి ఏవీ కఠినసత్యాలు కావని అనుభవంలోకి వస్తుంది. అసలైన జీవితం ఏదో కళ్లముందు నిలుస్తుంది. రాలిన ఆకులు, కూలిన కొమ్మలు, ఒరిగిన కాండాలు పిండరూప శరీరానికి ప్రతిరూపాలే అనే సత్యం బోధపడుతుంది. అప్రయత్నంగానే శరీరపత్రం రాలిపోతుంది. మళ్ళీ జనన వసంతంకోసం ఆత్మ తపిస్తుంది.

కాలవాహినిలో మనిషి ఒక బిందువు. కాలనక్షత్ర మండలంలో మనిషి ఒక చిరు చుక్క. రుతుగతులతో శ్రుతి కలుపుతూ సాగే అతడి ప్రయాణం అనంతాకాశంలో ఒక చిన్న అడుగువంటిది.

రుతువులు కాలరథ చక్రంలోని అరల్లా కొంతసేపు పైకి, కొంతసేపు కిందికి వస్తూపోతుంటాయి. ఆ కాలరథంపై మనిషి పుట్టుక నుంచి మరణం దాకా ప్రయాణిస్తాడు. ఏదో ఒకచోట తన యాత్రను ముగిస్తాడు. మనిషి యాత్ర ఆగినా, రుతువుల యాత్ర ఆగదు. అనంతకాల గమనంలో నిర్విరామంగా ముందుకు సాగుతూనే ఉంటుంది. రుతురాగాల్లో మనిషి తాదాత్మ్యం చెందుతాడు. అనిర్వచనీయమైన యోగాన్ని పొందుతాడు.

Post a Comment

0 Comments