Ad Code

Responsive Advertisement

Puri Ratha Yatra: పూరీ జగన్నాధుని రథయాత్ర


  • జగన్నాథ రథయాత్ర ఏటా ఆషాఢ శుక్ల విదియ రోజున జరుగుతుంది. 
  • అయితే, రథయాత్ర వేడుక కోసం సన్నాహాలు మాత్రం వైశాఖ శుక్ల తదియ నాడు జరిగే అక్షయ తృతీయ పర్వదినం నుంచే మొదలవుతాయి.
  • వేసవి వల్ల విగ్రహాలకు చందన లేపనాన్ని పూస్తారు. దీనినే ‘గంధలేపన యాత్ర’ అని అంటారు.
  • అక్షయ తృతీయ రోజున పూరీ క్షేత్రంలో రథాల తయారీ మొదలవుతుంది. అదే రోజు నుంచి జగన్నాథుని చందనయాత్ర కూడా మొదలవుతుంది. ఈ యాత్ర 42 రోజుల పాటు కొనసాగుతుంది.
  • మొదటి 21 రోజులను ‘బాహొరొ చందనయాత్ర’ (బహిర్‌ చందనయాత్ర) అంటారు.ఈ యాత్రలో ఉత్సవ విగ్రహాలను మాత్రమే నరేంద్రతీర్థంలో పడవలో ఊరేగిస్తారు.
  • తరువాత 21 రోజులను ‘భితొరొ చందనయాత్ర’ (అంతర్‌ చందనయాత్ర) అంటారు.ఈ యాత్రలో మాత్రం కేవలం నాలుగు రోజులు మాత్రమే (అమావాస్య,  షష్టి, ఏకాదశి, పౌర్ణమి) ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకొస్తారు.
  • జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిగే ‘స్నానయాత్ర’తో చందనయాత్ర వేడుకలు పూర్తవుతాయి.ఈ రోజు ఆలయ పూజారులు మంత్రోక్తంగా జగన్నాథునికి స్నాన వేడుకను నిర్వహిస్తారు. అందుకే జ్యేష్ఠపౌర్ణమిని ‘స్నానపూర్ణిమ’గా వ్యవహరిస్తారు.
  • స్నానపూర్ణిమ రోజు ‘సునా కువొ’ (బంగారు బావి) నుంచి తెచ్చిన 108 కుండల పవిత్ర జలాలను వినియోగిస్తారు.
  • స్నాన పూర్ణిమ తరువాత జగన్నాథునికి జ్వరం వస్తుంది. ఆనాటి నుంచి రెండువారాల పాటు పూరీ ఆలయంలో భక్తులకు మూలవిరాట్టుల దర్శనం ఉండదు.
  • మూలవిరాట్టుల స్థానంలో సంప్రదాయక ‘పొటొచిత్రొ’ పద్ధతిలో పెద్దవస్త్రంపై చిత్రించిన విగ్రహాల రూపాలనే దర్శించుకోవాల్సి ఉంటుంది.
  • ఈ రెండు వారాలు జగన్నాథుని మూలవిరాట్టుకు ఛప్పన్న (యాభై ఆరు) భోగాల నైవేద్యం కూడా నిలిచిపోతుంది.
  • రథయాత్ర నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను రథాలపైకి ఎక్కిస్తారు. విగ్రహాలను రథాలపైకి చేర్చే ముందు పూరీ రాజు సామాన్య సేవకుడిలా చీపురు పట్టి, రథాలను శుభ్రం చేస్తారు. 
  • రాజు శుభ్రం చేసి వచ్చిన తర్వాత మూడు విగ్రహాలనూ మూడు రథాలపైకి చేరుస్తారు. ఈ తతంగాన్ని ‘పొహాండి’ అంటారు. 
  • పూజారుల మంత్రాలు, మేళతాళాల నడుమ విగ్రహాలు రథాలపైకి చేరుకున్న తర్వాత పెద్దసంఖ్యలో భక్తులు వాటికి కట్టిన తాళ్లను పట్టుకుని రథాలను ముందుకు లాగుతారు. పూరీ జగన్నాథ ఆలయం ఎదుట ఉండే ‘బొడొదండొ’ (పెద్దవీధి) మీదుగా మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరం వరకు రథయాత్ర సాగుతుంది. 
  • జగన్నాథుని రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన రథయాత్ర. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం, కపిల సంహిత వంటి ప్రాచీన పురాణగ్రంథాల్లో జగన్నాథుని రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది.
  • మూడు రథాలూ ‘గుండిచా’ మందిరం వద్దకు చేరుకున్నాక, జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఆ మందిరంలో ఆషాఢ శుద్ధ దశమి వరకు కొలువుదీరుస్తారు. 
  • ‘గుండిచా’ మందిరంలో జగన్నాథుడు దశావతారాల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. తోటలో వెలసిన ‘గుండిచా’ మందిరాన్ని జగన్నాథుని ‘వేసవి తోట విడిది’గా పరిగణిస్తారు. జగన్నాథుడు కొలువు తీరిన తొమ్మిదిరోజుల రథయాత్ర వేడుక సమయంలోనే ‘గుండిచా’ మందిరం భక్తులతో కళకళలాడుతుంది. 
  • ఏడాదిలో మిగిలిన రోజుల్లో ఇది ఖాళీగా ఉంటుంది. 
  • రథయాత్ర మొదలైన ఐదో రోజున గుండిచా మందిరంలో ‘హీరా పంచమి’ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆరోజు జగన్నాథుడు నరసింహావతారంలో దర్శనమిస్తాడు. గుండిచాలో జరిగే వేడుకల్లో ఇది చాలా ప్రధానమైన వేడుక.
  • ఆషాఢ శుద్ధ దశమి నాడు గుండిచా మందిరం నుంచి ‘తిరుగు రథయాత్ర’ ప్రారంభమవుతుంది. దీనినే ‘బాహుడా’ అంటారు. 
  • మార్గమధ్యంలోని ‘అర్ధాసిని’ (మౌసి మా–పినతల్లి) మందిరం వద్ద ఆగి, అక్కడ నివేదించే మిఠాయిలను జగన్నాథుడు ఆరగిస్తాడు. 
  • ‘బాహుడా’ మరుసటి రోజున ఏకాదశి నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు స్వర్ణాలంకారాలతో రథాలపై కొలువుదీరి భక్తులకు నేత్రపర్వం చేస్తారు. దీనినే ‘సునాబేసొ’ (స్వర్ణ వేషధారణ) అంటారు. 
  • స్వర్ణవేషధారణలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలు చతుర్భుజాలతో, పాదాలతో పరిపూర్ణంగా దర్శనమిస్తారు.
  • మౌసి మా’ మందిరం వద్ద విరామం తర్వాత రథాలు తిరిగి ప్రధాన ఆలయం వైపు ముందుకు సాగుతాయి. 
  • చతుర్దశి ఘడియల్లో రాత్రివేళ జగన్నాథుని ఆలయ ప్రవేశ ఉత్సవం జరుగుతుంది. తనను తీసుకుపోకుండా సోదరీ సోదరులతో కలసి రథాలపై ఊరేగి తిరిగి వచ్చిన జగన్నాథునిపై లక్ష్మీదేవి అలకబూనడం, రసగుల్లాలు ఇచ్చి జగన్నాథుడు ఆమెను ప్రసన్నం చేసుకోవడం వంటి వినోదభరితమైన ఘట్టాలను పూజారులు నిర్వహిస్తారు. 
  • దాదాపు పక్షంరోజుల పాటు జగన్నాథుడు లేక చిన్నబోయిన పూరీ శ్రీక్షేత్రంలో ఆషాఢ పూర్ణిమ నాటి నుంచి యథాప్రకారం భక్తుల కోలాహలం మొదలవుతుంది.
జగన్నాథుని ప్రధాన ఆలయంలోనికి విదేశీయులను అనుమతించరు. రథయాత్ర వేడుకల్లోను, గుండిచా మందిరంలో కొలువుండే సమయంలోను విదేశీయులను కూడా జగన్నాథుని దర్శనానికి అనుమతిస్తారు.

పూరీ జగన్నాధుని రథయాత్ర తేదీ : జూన్  20, 2023. 

Post a Comment

0 Comments